ఎస్సీ వర్గీకరణకు తాము కట్టుబడి ఉన్నామని ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు అసెంబ్లీలో ప్రకటించారు. ఎస్సీ వర్గీకరణపై అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపితే సమస్య పరిష్కారమవుతుందని తెలిపారు. జిల్లాల వారీగా కేటగిరీల విభజన చేయాల్సిన అవసరం ఉందన్నారు. జనగణన తర్వాత మరోసారి విభజన చేసేందుకు సిద్ధమని చెప్పారు. 1996లో ఏబీసీడీ కేటగిరీ విభజన కోసం కమిటీ ఏర్పాటు చేసిన విషయాన్ని గుర్తు చేశారు.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో రేషనలైజేషన్, కేటగిరీలపై 2000లో చట్టం చేశామని, కానీ ఆ చట్టాన్ని కోర్టు కొట్టివేసిందని పేర్కొన్నారు. ఎస్సీ వర్గీకరణ జరగాలని ఉషా మెహ్రా కమిషన్ రిపోర్ట్ ఇచ్చిందని తెలిపారు. స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లపై కూడా కమిటీ రీసెర్చ్ చేసిందని చెప్పారు. ఎస్సీ వర్గీకరణ సాకారం కావడంలో తన ప్రయాణం సుదీర్ఘంగా సాగిందని, సుప్రీంకోర్టు తీర్పు వచ్చే వరకు ఉండటం తన అదృష్టమని అన్నారు.
న్యాయ కోసం పరితపించిన వ్యక్తి ఎన్టీఆర్ అని, ఎస్సీ, ఎస్టీలకు 50 శాతం ఇళ్లు కేటాయించిన మొదటి వ్యక్తి ఆయన అని గుర్తు చేసుకున్నారు. ఎస్సీల పట్ల వివక్ష ఇంకా కొనసాగుతుండటం బాధాకరమని, అంటరానితనం నిషేధానికి జస్టిస్ పున్నయ్య కమిషన్‌ను తానే వేశానని, కుల వివక్షను రూపుమాపడానికి ఎన్నో జీవోలు జారీ చేశామని పేర్కొన్నారు.