CM Chandrababu at CII Summit: భారత్‌లో పెట్టుబడులు పెట్టాలనుకునేవారికి ఆంధ్రప్రదేశ్ అత్యుత్తత్తమ గమ్యస్థానమని సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. పోటీ ప్రపంచంలో పెట్టుబడులను నిరంతరం ఆకర్షించడం ద్వారానే పేదరికాన్ని నిర్మూలించవచ్చని స్పష్టం చేశారు. ఢిల్లీలో జరిగిన ‘సీఐఐ పార్ట్‌నర్‌షిప్ సమ్మిట్ కర్టెన్ రైజర్’ కార్యక్రమంలో ‘సన్‌రైజ్ ఆంధ్రప్రదేశ్’ డాక్యుమెంటరీని ఈ సందర్భంగా చంద్రబాబు ఆవిష్కరించారు.
రాష్ట్ర వృద్ధి లక్ష్యాలను, పెట్టుబడుల ఆకర్షణ విధానాలను ఈ సదస్సులో సీఎం చంద్రబాబు వివరించారు. 2024-25లో ఆంధ్రప్రదేశ్ 8.25 శాతం వృద్ధిరేటు సాధించిందని.. ‘ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్’ నుంచి ‘స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్’కు మారినట్లు వెల్లడించారు. ప్రతీ 50 కిలోమీటర్లకు ఒక పోర్టు ఏర్పాటు చేసే యోచనలో ఉన్నట్లు చెప్పారు. జనవరి నాటికి అమరాతిలో క్వాంటం కంప్యూటింగ్‌కు ఏర్పాటుకు చర్యలతో పాటు, రానున్న రెండేళ్లలో రాష్ట్రంలో క్వాంటం కంప్యూటర్ల తయారు చేపడతామని చంద్రబాబు స్పష్టం చేశారు.
Also Read: https://teluguprabha.net/technology-news/made-in-india-arattai-app/
‘ఆదాయాన్ని సృష్టించడం ద్వారానే ప్రజలకు మెరుగైన సేవలను అందించగలం. తద్వారా పేదరికాన్ని సమూలంగా నిర్మూలించగలం. 2024-2025 ఆర్థిక సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ 8.25 శాతం వృద్ధిరేటును సాధించింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కేవలం 15 నెలల్లోనే పలు కీలక విధానాలను తీసుకువచ్చింది.’ అని సీఎం చంద్రబాబు ఉద్ఘాటించారు.
ఏపీలో ఏడోసారి సీఐఐ భాగస్వామ్య సదస్సు నిర్వహించబోతున్నట్లు తెలిపిన చంద్రబాబు.. రాష్ట్రాలను ప్రమోట్ చేయడానికి, పెట్టుబడులను ఆకర్షించడానికి సీఐఐ ఒక శక్తిమంతమైన వేదిక అని తెలిపారు. రాష్ట్రంలో మరిన్ని విమానాశ్రయాలు ఏర్పాటు చేయబోతున్నామని.. ఉత్తమమైన లాజిస్టిక్స్‌కు కేంద్రంగా ఏపీని చేయాలనేదే తన ఆలోచన అని పేర్కొన్నారు. స్వర్ణాంధ్రప్రదేశ్ 2047 నినాదంతో ముందుకెళ్తున్నామని.. 2.47 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా ఎదిగేందుకు కృషి చేస్తున్నట్లు సీఎం చంద్రబాబు వివరించారు.


