CM Chandrababu Naidu: మాజీ సీఎం జగన్ చేతకాని పాలనలో పోలవరం పనులు రివర్స్ అయ్యాయని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విమర్శించారు. శుక్రవారం రాష్ట్రంలో నీటి సమర్థ నిర్వహణపై శాసనసభలో జరిగిన చర్చలో ఆయన ప్రసంగించారు. ఐదేళ్ల వైసీపీ పాలనలో రాష్ట్ర జీవనాడి అయిన పోలవరం ప్రాజెక్టు పూర్తిగా తిరోగమనంలో పయనించిందని ఆరోపించారు. విధ్వంసంతో పరిపాలన ప్రారంభించిన వారు విధ్వంసంతోనే చరిత్రలో నిలిచిపోయారని చంద్రబాబు ఎద్దేవా చేశారు.
గత పాలకుల అసమర్థత, అహంకారం వల్లే రూ. 400 కోట్లతో నిర్మించిన పోలవరం డయాఫ్రం వాల్ కొట్టుకుపోయిందని సీఎం చంద్రబాబు నాయుడు ఆరోపించారు. కాంట్రాక్టర్లను మార్చవద్దని కేంద్ర జలసంఘం సూచించినా పెడచెవిన పెట్టడం వల్లే ఈ దుస్థితి దాపురించిందని మండిపడ్డారు. దెబ్బతిన్న డయాఫ్రం వాల్‌ను 2025 డిసెంబరు నాటికి పూర్తి చేసి, పోలవరానికి పూర్వ వైభవం తీసుకొస్తామని ఈ సందర్భంగా సభలో సీఎం హామీ ఇచ్చారు.
Also Read: https://teluguprabha.net/andhra-pradesh-news/deputy-cm-pawan-kalyan-speech-on-plastic-free-ap/
‘2014-19 మధ్య తెలుగుదేశం ప్రభుత్వం ఐదేళ్లలో సాగునీటి ప్రాజెక్టులపై రూ. 68,417 కోట్లు ఖర్చు చేసింది. 2019-24 మధ్య వైసీపీ ప్రభుత్వం కేవలం రూ. 28,376 కోట్లు మాత్రమే వెచ్చించింది. మా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఈ ఒక్క ఏడాదిలోనే బడ్జెట్‌లో రూ. 12,454 కోట్లు కేటాయించాం. టీడీపీ హయాంలో 72 శాతం పూర్తయిన పోలవరం పనులను, గత ఐదేళ్లలో కేవలం 3.84 శాతం మాత్రమే ముందుకు తీసుకెళ్లారు. ఇది వారి చేతకానితనానికి నిదర్శనం.’ అని చంద్రబాబు వ్యాఖ్యానించారు.
దేశంలోనే తొలిసారిగా గోదావరి-కృష్ణా నదులను అనుసంధానం చేసిన ఘనత టీడీపీ ప్రభుత్వానిదేనని చంద్రబాబు గుర్తుచేశారు. రాష్ట్రంలోని నదుల అనుసంధానం ద్వారానే శాశ్వత నీటి భద్రత సాధ్యమని ఉద్ఘాటించారు. రానున్న కాలంలో రాష్ట్రంలోని అన్ని నదులను అనుసంధానం చేసి, ప్రతి ఎకరాకు నీరందిస్తామని స్పష్టం చేశారు. ఒకప్పుడు రాయలసీమలో వేరుశనగ వేసిన రైతులకు పెట్టుబడి కూడా రాని దుస్థితి ఉండేదని, తాము అధికారంలో ఉన్నప్పుడు ఇన్‌పుట్ సబ్సిడీ ఇచ్చి ఆదుకున్నామని చంద్రబాబు గుర్తు చేశారు.
ఎమ్మెల్యేలందరూ తమ నియోజకవర్గాల్లో భూగర్భ జలాలను పెంచే బాధ్యత తీసుకోవాలని చంద్రబాబు పిలుపిచ్చారు. హంద్రీనీవా కాలువ ద్వారా 738 కిలోమీటర్ల దూరం నీటిని తరలించి, తన నియోజకవర్గమైన కుప్పం ప్రజల రుణం తీర్చుకున్నానని చంద్రబాబు భావోద్వేగంతో మాట్లాడారు. రూ. 3,800 కోట్లతో 468 చెరువులను నింపే కార్యక్రమం కొనసాగుతోందని వెల్లడించారు.


