CM Review on Irrigation Projects: నిర్దేశిత గడువులోగా రాష్ట్రంలోని సాగునీటి ప్రాజెక్టులన్నింటినీ పూర్తి చేయాలని అధికారులను సీఎం చంద్రబాబు ఆదేశించారు. పోలవరం సహా కీలక సాగునీటి ప్రాజెక్టులు, నీటి నిర్వహణపై జలవనరులశాఖ ఉన్నతాధికారులతో అమరావతిలో సోమవారం ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు.
Also Read: https://teluguprabha.net/national-news/pm-narendra-modi-receives-highest-award-from-king-of-norway/
ఖరీఫ్ సీజన్ ఆలస్యం కాకుండా కాల్వలకు నీటి విడుదల చేయాలని అధికారులను సీఎం ఆదేశించారు. ఇటీవల విడుదల చేసిన ఇరిగేషన్ క్యాలెండర్‌కు అనుగుణంగా నిర్దేశిత గడువు లోగా ప్రాజెక్టులు పూర్తి కావాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఈ క్యాలెండర్‌లో మరో 11 ప్రాజెక్టులకు ప్రాధాన్యత కల్పించారు. వాటర్ మేనేజ్‌మెంట్‌లో సాగునీటి సంఘాలతో పాటు ప్రజల భాగస్వామ్యం కూడా తీసుకువచ్చేలా చర్యలు చేపట్టాలని సూచించారు. భూగర్భ జలాలను సద్వినియోగం చేసుకునేలా స్వల్ప, మధ్య, దీర్ఘకాలిక ప్రణాళికలను సిద్ధం చేయాలని స్పష్టం చేశారు. పోలవరం ఎడమ కాల్వ చంపావతి లింక్‌పై అధ్యయనం చేయాలని.. 2027 ఏప్రిల్ నాటికి పోలవరం నిర్వాసితుల తరలింపు పూర్తి చేయాలని ఆదేశించారు.

Also Read: https://teluguprabha.net/crime-news/container-hits-wedding-party-in-maharashtra-12-dead/
ఈ సమావేశంలో జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సాయి ప్రసాద్, జలవనరుల శాఖ ఉన్నతాధికారులు హాజరయ్యారు.

ఏపీకి బుల్లెట్..
అదేవిధంగా ఈ రోజు సచివాలయంలో రాయల్ ఎన్‌ఫీల్డ్ సంస్థ సీఈఓ గోవింద రాజన్.. సీఎం చంద్రబాబుతో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. తిరుపతి జిల్లాలో బుల్లెట్ బైక్ తయారీ ప్లాంట్ ఏర్పాటు నేపథ్యంలో చంద్రబాబుతో చర్చించారు. సంస్థ ప్రతినిధులు సైతం ఈ భేటీలో పాల్గొన్నారు. సత్యవేడు మండలం రాళ్లకుప్పం, వానల్లూరు గ్రామాల వద్ద రూ. 2500 కోట్ల పెట్టుబడితో బుల్లెట్ తయారీ ప్లాంట్ ఏర్పాటు చేయనున్నట్లు సీఎం తెలిపారు. ఇక్కడ అత్యాధునిక తయారీ యూనిట్‌తో పాటు టెస్టింగ్ ట్రాక్, పరిశోధనా కేంద్రం, వెండార్ పార్క్ ఎకోసిస్టమ్ కూడా నిర్మించనున్నట్లు చెప్పారు.
ఈ ప్లాంట్ ద్వారా ఏడాదికి 9 లక్షల బుల్లెట్ మోటార్ సైకిళ్లు ఉత్పత్తి చేయనుండగా.. ఈ యూనిట్ ద్వారా ప్రత్యక్షంగా, పరోక్షంగా 15 వేల మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు లభిస్తాయని చంద్రబాబు వివరించారు. ప్రాజెక్టును బుల్లెట్ వేగంతో ముందుకు తీసుకువెళ్లి, 18 నెలల్లో నిర్మాణం పూర్తి చేసి బుల్లెట్ మోటార్ సైకిల్ ఉత్పత్తి ప్రారంభించాలని ఈ సందర్భంగా సీఎం.. సంస్థ సీఈఓను కోరారు.

