CM Chandrababu Review With Collectors: సచివాలయంలో సీఎం చంద్రబాబు నాయుడు రెండో రోజు కలెక్టర్లతో సమావేశం నిర్వహించారు. ఈ రోజు పలు విభాగాలపై సమీక్షిస్తున్నారు. స్వర్ణాంధ్ర విజన్, డీప్ టెక్, సూపర్ సిక్స్, రెవెన్యూ, విద్య తదితర అంశాలపై కలెక్టర్లతో చర్చించారు. పాలనలో వినూత్న మార్పులు తీసుకురావాలని ఈ సందర్భంగా కలెక్టర్లకు సీఎం సూచించారు.
ఈ రోజు ప్రధానంగా ఫైళ్ల క్లియరెన్స్, అవేర్, డేటా లేక్ వంటి అంశాలపై సీఎం చంద్రబాబు సమీక్షించారు. ఈ- ఫైళ్ల క్లియరెన్స్ రోజుల వ్యవధి నుంచి గంటల వ్యవధిలోకి రావడంపై సంతృప్తి వ్యక్తం చేసిన సీఎం.. ఈ విధానంలో వేగంగా ఉన్న మంత్రులు, కలెక్టర్లు, ఎస్పీలు, సెక్రటరీలను అభినందించారు. పెద్దమొత్తంలో ఫైళ్లు వచ్చినా సరాసరి 10 గంటల వ్యవధిలో ఫైళ్లను డిస్పోజ్ చేసిన సీఎస్ సాయి ప్రసాద్‌కు ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు. ఈ- ఫైళ్ల క్లియరెన్స్‌లో వెనుకబడిన పలువురు కలెక్టర్లు, ఎస్పీలు, జాయింట్ కలెక్టర్లు వేగం పెంచాలని సూచించారు. కాగా, గత మూడు నెలలతో పోల్చుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా ఫైళ్ల క్లియరెన్స్ సమయం 10 రోజుల నుంచి రెండు రోజులకు తగ్గిందని ఈ సందర్భంగా ఐటీ సెక్రటరీ.. ముఖ్యమంత్రికి తెలిపారు.
‘ఫైళ్లను త్వరగా క్లియర్ చేస్తే ప్రభుత్వ సేవలు మరింత త్వరగా అందుతాయి. స్పీడ్ ఆఫ్ డెలివరింగ్ గవర్నెన్సులో ఫైళ్ల క్లియరెన్స్ అనేది అతి ముఖ్యమైన అంశం. సీఎస్, సెక్రటరీలు, హెచ్‌ఓడీలు మొదలుకుని.. మండల స్థాయి వరకు ఫైళ్ల క్లియరెన్సులో వేగం పెరగాలి. మ్యానువల్ ఫైళ్లనేవి దాదాపు లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని. పాలనకు టెక్నాలజీని అనుసంధానించడంతో పాటు.. హ్యూమన్ టచ్ కూడా ముఖ్యం. 24 గంటల్లోపు ఈ-ఫైల్స్ డిస్పోజ్ చేసేలా మంత్రులు, అధికారులు శ్రద్ధ వహించాలి. ఫైళ్ల క్లియరెన్స్ విషయంలో అందరి పనితీరును ఎప్పటికప్పుడు నమోదు చేస్తూనే ఉన్నాం.- సీఎం చంద్రబాబు
జిల్లాల్లో ఈ-ఆఫీస్ ద్వారా లేని ఫైల్స్ ఎన్ని ఉన్నాయో గుర్తించాలని అధికారులను సీఎం చంద్రబాబు ఆదేశించారు. జిల్లా స్థాయిలో, హెచ్‌ఓడీలు తప్పనిసరిగా ఈ-ఫైల్స్ మాత్రమే జనరేట్ చేయాలని చెప్పారు. ప్రజలకు సేవలందించే విషయంలో వినూత్న ఆలోచనలతో పాటు మరింత మెరుగైన పాలనకు కలెక్టర్లు వినూత్నంగా ఆలోచించాలని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు.

