CM Chandrababu On Dubai: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విజయవాడలో నిర్వహించిన “ఇన్వెస్టోపియా గ్లోబల్ ఏపీ” సదస్సులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, దుబాయ్ అభివృద్ధిని ప్రశంసించారు. ఎడారిని స్వర్గంగా మలచిన విధానాన్ని చూస్తే తనకు అసూయ వేస్తుందని వ్యాఖ్యానించారు. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) అభివృద్ధిలో భారత్ సైతం కీలక పాత్ర పోషిస్తోందని, అది గర్వకారణంగా ఉందన్నారు. ముఖ్యంగా దుబాయ్‌లోని బీచ్‌లు, ఎడారి ప్రాంతాలను పర్యాటకులకు ఆకర్షణీయంగా మలచిన విధానాన్ని ఆయన విశేషంగా కొనియాడారు.
ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ.. సంక్షోభాలను అవకాశాలుగా మార్చుకోవడం ద్వారా దేశాలు, రాష్ట్రాలు అభివృద్ధి చెందుతాయని చెప్పారు. కొత్త ఆలోచనలు, ఆవిష్కరణల ద్వారానే మార్పులు సాధ్యమవుతాయని అభిప్రాయపడ్డారు. యూఏఈలో భారతీయుల జనాభా 40 శాతానికి చేరిందని, భారత్‌తో అక్కడకు బలమైన సంబంధాలు ఉన్నాయని తెలిపారు. 1991లో ఆర్థిక సంస్కరణలు, 1995లో సాంకేతిక విప్లవం దేశ దశను మార్చాయని గుర్తు చేశారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలో భారత్ భారీ అవకాశాలు అందుకుంటోందని, 2047 నాటికి “వికసిత్ భారత్” లక్ష్యాన్ని సాధించి ప్రపంచంలో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ ఎదుగుతుందని వివరించారు.
సభలో చంద్రబాబు చెప్పిన ఇతర ముఖ్యాంశాల్లో, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ప్రవేశపెట్టిన “విజన్ 2020” ప్రణాళిక, రాష్ట్ర అభివృద్ధికి ఎలా దోహదపడిందనే విషయాన్ని గుర్తు చేశారు. అలాగే, 2026 నాటికి రాష్ట్రంలో “క్వాంటం కంప్యూటింగ్ వ్యాలీ” ఏర్పాటయ్యేలా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. ఇప్పటికే వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా 575 ప్రభుత్వ సేవలు ప్రజలకు అందుబాటులోకి తెచ్చామని, త్వరలోనే అంటే ఆగస్టు 15 నాటికి అన్ని సేవలను పూర్తిగా ఆన్‌లైన్‌లోకి తీసుకువచ్చే ప్రణాళిక ఉందన్నారు. ఈ సదస్సులో వివిధ దేశాల ప్రతినిధులు పాల్గొని పెట్టుబడుల అవకాశాలు, ఆర్థిక సహకారం, అభివృద్ధి రంగాల్లో భాగస్వామ్యం వంటి అంశాలపై చర్చలు జరిపారు. ముఖ్యమంత్రి తన ప్రసంగంలో ఆరోగ్యం, సంపద, సంతోషకర సమాజ నిర్మాణమే తమ ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు. ప్రభుత్వ, ప్రైవేట్ భాగస్వామ్యంతో చేపడుతున్న అభివృద్ధి పనులను ఆయన ఈ సందర్భంగా వివరించారు.


