CRDA 47వ అథారిటీ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఈ సమావేశంలో తీసుకున్న కొన్ని ముఖ్యమైన నిర్ణయాలను పురపాలక శాఖ మంత్రి నారాయణ వెల్లడించారు. మొత్తం రూ.1732.31 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు గ్రీన్ సిగ్నల్ లభించిందని ఆయన చెప్పారు. మొదటిగా, గెజిటెడ్ అధికారుల కోసం అధునాతన నివాస భవనాల నిర్మాణానికి రూ.514 కోట్లు ఖర్చుతో ప్రాజెక్ట్‌కి అనుమతి ఇచ్చారు. అలాగే నాన్ గెజిటెడ్ అధికారుల కోసం 9 టవర్లను మౌలిక సదుపాయాలతో కలిపి నిర్మించేందుకు రూ.194 కోట్ల మేరకు అనుమతి లభించింది. ఈ రెండు నిర్మాణాలకు సంబంధించి రూ.517 కోట్ల విలువైన టెండర్లను ఆమోదించారు.
నీటి సరఫరా విషయంలో కూడా ముందడుగు వేశారు. 190 ఎంఎల్ డీల సామర్థ్యం గల వాటర్ ట్రీట్‌మెంట్ ప్లాంట్ ఏర్పాటు కోసం రూ.568.57 కోట్లతో టెండర్‌కు అనుమతి ఇచ్చారు. అలాగే, 15 ఓవర్‌హెడ్ వాటర్ ట్యాంకులు నిర్మించేందుకు రూ.494 కోట్ల నిధులతో పనులు చేపట్టనున్నారు. రోడ్ల విభాగంలో 3.5 కిలోమీటర్ల పొడవైన ఈ3 ఎలివేటెడ్ రోడ్డుకు అనుమతి ఇచ్చారు. అదేకాదండీ, 15, 13 నెంబర్ల రహదారులను నేషనల్ హైవేకు అనుసంధానం చేసే పనులకు రూ.70 కోట్లతో పాటు రూ.387 కోట్ల నిధులను ఖర్చుచేయనున్నారు.
భూ కేటాయింపులు కూడా ఈ సమావేశంలో ముఖ్యాంశంగా నిలిచాయి. వివిధ సంస్థలకు భూములు కేటాయిస్తూ జీవోఏం ద్వారా నిర్ణయాలు తీసుకున్నారు. న్యాయ విశ్వవిద్యాలయానికి 50 ఎకరాలు, క్వాంటం వ్యాలీకి మరో 50 ఎకరాలు కేటాయించారు. బసవతారకం ఆస్పత్రికి అదనంగా మెడికల్ కాలేజీ కోసం 6 ఎకరాలు కేటాయించగా, గతంలో ఇదే సంస్థకు 15 ఎకరాలు కేటాయించామని మంత్రి తెలిపారు. అదే విధంగా ఆదాయపు పన్ను శాఖకు 0.78 ఎకరాలు, రెడ్‌క్రాస్ సొసైటీకి 0.78 ఎకరాలు, కోస్టల్ బ్యాంక్‌కు 0.40 ఎకరాలు, ఐఆర్‌సీటీసీకి 1 ఎకరా భూమిని కేటాయించినట్లు వెల్లడించారు.
ఈ సమావేశంలో మంత్రివర్గ ఉపసంఘం రాజధాని ప్రాంతంలో ఏకంగా 7 సంస్థలకు భూములు కేటాయించింది. ఇప్పటి వరకు 64 సంస్థలకు భూ కేటాయింపులు జరిగాయని, మొత్తంగా ఇప్పటిదాకా రాజధాని పరిధిలో 1050 ఎకరాల భూమిని కేటాయించామని మంత్రి నారాయణ తెలిపారు.