Pawan Kalyan Janasena Review Meeting: మంగళగిరిలోని జనసేన కార్యాలయంలో పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలతో ఆ పార్టీ అధ్యక్షుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సమావేశమయ్యారు. ఈ సమావేశంలో ముగ్గురు ఎమ్మెల్యేలు మినహా అందరూ పాల్గొన్నట్లు సమాచారం. ముందుగా ఎమ్మెల్యేలందరితో సమావేశమైన అనంతరం.. నియోజకవర్గాల వారిగా ఎమ్మెల్యేలు, ఎంపీలతో విడివిడిగా మాట్లాడారు.
జనసేన పార్టీని మరింత బలోపేతం చేసే దిశగా పార్టీ కార్యక్రమాలు చేపట్టాలని పవన్ కల్యాణ్ దిశానిర్దేశం చేశారు. అనంతరం నామినేటెడ్ పోస్టులపై ఎమ్మెల్యేల అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు. క్షేత్ర స్థాయిలో కూటమి పార్టీల నేతలతో కలిసి పని చేయాలని సూచించిన పవన్.. అభిప్రాయ బేధాలను ఎప్పటికప్పుడు పరిష్కరించుకోవాలని చెప్పారు. ప్రతి కార్యకర్తకు ఎమ్మెల్యే స్థాయి నేతలు అండగా ఉండాలని.. పార్టీ కోసం పనిచేసేవారికి ఏ ఇబ్బంది వచ్చినా అండగా నిలవాలని స్పష్టం చేశారు. పార్టీని బలోపేతం చేయడంలో ఎమ్మెల్యేల బాధ్యత కీలకమని పవన్ కల్యాణ్ ఉద్ఘాటించారు.
సుమారు రెండున్నర గంటలపాటు జరిగిన జనసేన శాసనసభాపక్ష సమావేశంలో నియోజకవర్గాల్లో తాగునీరు, రోడ్లు, పారిశుద్ధ్యం వంటి అంశాలపైనా ఎమ్మెల్యేలతో చర్చించారు. ఎమ్మెల్యేల పనితీరుపై తనకు వచ్చిన నివేదికల ఆధారంగా సమీక్ష జరిపారు. మరోవైపు అక్టోబర్ నుంచి పలు జిల్లాల్లో పవన్ పర్యటించనున్న నేపథ్యంలో త్రిశూల వ్యూహంపైనా సమీక్షలో చర్చించారు.


