YSRCP MLC Anantha Babu Driver Subrahmanyam Murder Case: కాకినాడకు చెందిన దళిత యువకుడు డ్రైవర్ వీధి సుబ్రహ్మణ్యం హత్య కేసులో నిందితుడిగా ఉన్న వైసీపీ ఎమ్మెల్సీ అనంత బాబుకు హైకోర్టులో ఊరట లభించింది. సుబ్రహ్మణ్యం హత్యకేసులో తదుపరి దర్యాప్తు పేరుతో మళ్లీ మొదటి నుంచి దర్యాప్తు చేయడానికి వీలులేదని హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది.
ఈ కేసులో తదుపరి విచారణకు అనుమతి ఇస్తూ రాజమహేంద్రవరం ఎస్‌సి, ఎస్‌టి ప్రత్యేక కోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సవాల్ చేస్తూ అనంతబాబు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. ప్రత్యేక కోర్టు ఇచ్చిన ఉత్తర్వులను రద్దు చేయాలని, లేకపోతే మొదటి నుంచి దర్యాప్తు చేసే అవకాశం ఉందని పిటిషన్‌లో అనంతబాబు పేర్కొన్నారు. దర్యాప్తు అధికారి పునర్ దర్యాప్తు మొదలుపెట్టి వేధించే అవకాశం ఉందని అనంతబాబు తరుపు సీనియర్ న్యాయవాది చిత్తరవు రఘు వాదించారు.
తాజాగా అనంతబాబు పిటిషన్‌పై విచారణ చేసిన న్యాయస్థానం కీలక ఆదేశాలను జారీ చేసింది. సుబ్రహ్మణ్యం హత్య కేసులో.. కేవలం విచారణ తదుపరి దర్యాప్తునకే పరిమితం కావాలని, మొదటి నుంచి చేయడానికి వీల్లేదని స్పష్టం చేసింది. ఈ మేరకు దర్యాప్తు అధికారికి జస్టిస్ యడవల్లి లక్ష్మణరావు ఉత్తర్వులు జారీ చేశారు.
కాగా, వైసీపీ ప్రభుత్వ హయాంలో 2022 మే 19న డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని అనంతబాబు హత్య చేసి మృతదేహాన్ని డోర్ డెలివరీ చేశారనే ఆరోపణలతో కేసు నమోదైన సంగతి తెలిసిందే. ఈ కేసులో ఎమ్మెల్సీ ఒక్కరినే పోలీసులు నిందితుడిగా చేర్చారు. అనంతబాబు కేసులో ఇప్పటికే ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని నియమించింది. సిట్ అధికారులు విచారణ ప్రారంభించి.. అనంతబాబుకు సహకరించినవారిపై ఫోకస్ పెట్టారు. 90 రోజుల్లో విచారణ పూర్తి చేసి హత్య కేసులో జరిగిన కుట్ర అంతా బయట పెట్టాలని అనుకుంటున్నారు. కేసు పూర్వాపరాలు తేల్చి, బాధితులకు న్యాయం చేసే విషయంలో సిట్ ఏ అవకాశాన్ని వదిలి పెట్టకూడదని భావిస్తోంది.


