AP High Court Justice Donadi Ramesh: ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ దోనాడి రమేశ్ శుక్రవారం ప్రమాణ స్వీకారం చేశారు. అలహాబాద్ హైకోర్టు నుంచి ఏపీ హైకోర్టుకు జస్టిస్ రమేశ్ బదిలీపై వచ్చారు. నేడు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ ఆయనతో ప్రమాణ స్వీకారం చేయించారు. 2020 జనవరి 13న ఏపీ హైకోర్టు న్యాయమూర్తి పదవీ బాధ్యతలు స్వీకరించిన జస్టిస్ రమేశ్.. 2023లో అలహాబాద్ హైకోర్టుకు బదిలీపై వెళ్లారు. ఇటీవల మళ్లీ ఇక్కడికి ట్రాన్స్‌ఫర్‌పై వచ్చారు.
జస్టిస్ దోనాడి రమేశ్ ప్రస్థానం
1965 జూన్ 27న జన్మించిన జస్టిస్ దోనాడి రమేశ్ స్వస్థలం చిత్తూరు జిల్లా మదనపల్లె సమీపంలోని కమ్మపల్లి. తల్లిదండ్రులు అన్నపూర్ణమ్మ, నారాయణ నాయుడు. శ్రీ వేంకటేశ్వర ఆర్ట్స్ కళాశాల నుంచి డిగ్రీ పూర్తి చేసిన ఆయన.. నెల్లూరు వీఆర్ లా కళాశాలలో న్యాయశాస్త్రంలో విద్యనభ్యసించారు. ఏపీ బార్ కౌన్సిల్‌లో 1990లో పేరు నమోదు చేసుకున్నారు. అక్కడి నుంచి హైకోర్టులో ప్రాక్టీస్ ప్రారంభించారు.
2000 డిసెంబర్ నుంచి 2004 వరకు ప్రభుత్వ న్యాయవాదిగా పనిచేశారు. 2013 వరకు ఏపీ సర్వశిక్ష అభియాన్‌కు స్టాండింగ్ కౌన్సిల్‌గా పనిచేశారు. 2014 నుంచి 19 వరకు ఐదేళ్లపాటు ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాదిగా సేవలందించారు. 2020లో ఏపీ హైకోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యారు.


