Minister Narayana: ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అభివృద్ధిపై గతంలో ఏర్పాటు చేసిన సింగపూర్ కన్సార్టియం ఇప్పుడు స్టార్టప్ ప్రాజెక్టుల విషయంలో భాగస్వామ్యం కల్పించలేమని స్పష్టం చేసిందని, అయితే అవసరమైన సాంకేతిక సహకారం మాత్రం అందించేందుకు సిద్ధంగా ఉందని రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణ తెలిపారు. అలాగే, ఇతర అభివృద్ధి ప్రాజెక్టుల్లో భాగస్వామ్యం చూపించేందుకు సింగపూర్ సంస్థలు ఆసక్తి చూపుతున్నట్టు కూడా ఆయన తెలిపారు.
సింగపూర్ పర్యటన ముగించుకుని రాష్ట్రానికి తిరిగొచ్చిన మంత్రి నారాయణ, విజయవాడలో జరిగిన మీడియా సమావేశంలో ఈ విషయాలు వెల్లడించారు. తన పర్యటనలో అక్కడి నగర పరిపాలన, వ్యర్థాల నిర్వహణ విధానాలను పరిశీలించామన్నారు. ఆ విధానాలు రాష్ట్రంలోనూ అమలు చేయవచ్చని అభిప్రాయపడ్డారు.
ఈ సందర్భంగా మాజీ ప్రభుత్వ నిర్ణయాలపై ఆయన తీవ్రంగా స్పందించారు. 2014–19 మధ్య కాలంలో టీడీపీ ప్రభుత్వం సింగపూర్ సంస్థలతో కలసి అమరావతి అభివృద్ధికి ఒప్పందాలు చేసిందని, కానీ తరువాత వచ్చిన వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం వాటిని రద్దు చేయడమే కాకుండా, సింగపూర్ కంపెనీలపై విచారణ చేపట్టేందుకు సీఐడీ అధికారులను అక్కడికి పంపించిందని ఆయన ఆరోపించారు. ఈ చర్యలు సింగపూర్ ప్రభుత్వాన్ని అసహనానికి గురి చేశాయని మంత్రి తెలిపారు.
అయితే తాజా పరిణామాల్లో, రాష్ట్రం–సింగపూర్ మధ్య మైత్రీ సంబంధాలను పునరుద్ధరించాలన్న దృష్టితో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇటీవల సింగపూర్ వెళ్లి, అక్కడి అధ్యక్షుడితో పాటు కీలక మంత్రులను కలిసి చర్చలు జరిపారని మంత్రి నారాయణ చెప్పారు. ఈ సమావేశాల్లో చంద్రబాబు ప్రతిష్టను గుర్తించిన సింగపూర్ నేతలు సానుకూలంగా స్పందించారని వెల్లడించారు. రాష్ట్ర అభివృద్ధికి కావాల్సిన సహకారం అందించేందుకు వారు ఆసక్తి చూపారని, తాజా పరిణామాలు అందుకు నిదర్శనమని మంత్రి నారాయణ వివరించారు.


