ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం ఆంధ్రప్రదేశ్ పర్యటనకు రానున్నారు. అమరావతిలో రాజధాని నిర్మాణ పనులను పునఃప్రారంభించేందుకు ఏర్పాటు చేస్తున్న సభ కోసం ఇప్పటికే భారీ ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. లక్షలాది మంది ప్రజలు ఈ సభకు హాజరయ్యే అవకాశముండటంతో, విస్తృత ఏర్పాట్లతో పాటు భద్రతకు అధికారులు అధిక ప్రాధాన్యత ఇస్తున్నారు. అయితే ఈ ముఖ్య ఘట్టానికి ముందు వాతావరణ శాఖ వెలువరించిన హెచ్చరిక ఇప్పుడు అధికారులను ఆందోళనకు గురిచేస్తోంది.
బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం వల్ల.. కోస్తా ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని, కొన్ని చోట్ల ఈదురుగాలులతో కూడిన వర్షం పడొచ్చని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ నేపథ్యంలో, అమరావతిలో జరిగే ప్రధాని సభ వర్ష ప్రభావానికి లోనయ్యే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. శుక్రవారం జరిగే సభ సమయంలో వర్షం కురిసే పరిస్థితి తలెత్తితే ప్రజలు చెదిరిపోయే ప్రమాదం ఉండటంతో, భద్రతా ఏర్పాట్లపై మంత్రులు, ఉన్నతాధికారులు ప్రత్యేకంగా దృష్టి సారించారు.
ఇటీవల తిరుపతిలో జరిగిన తొక్కిసలాట ఘటనను గుర్తుచేసుకుంటూ, ఇలాంటి ప్రమాదాలు సంభవించకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని నోడల్ ఆఫీసర్ వీర పాండ్యాన్ ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. సభ ప్రాంగణంలోని ప్రవేశ ద్వారాల వద్ద, ప్రజల కదలికల దిశగా ప్రత్యేక పర్యవేక్షణ, వెంటనే స్పందించే టీమ్లను సిద్ధం చేయాలని నిర్ణయించారు. వర్షం అనూహ్యంగా కురిసే అవకాశాన్ని దృష్టిలో పెట్టుకుని సభ వేదిక వద్ద తడవకుండా, తొక్కిసలాటలు లేకుండా ప్రజలను సమర్థంగా నియంత్రించేందుకు అనేక సూచనలు భద్రతా సిబ్బందికి సూచిస్తున్నారు. ప్రజల రక్షణకు ఎలాంటి విఘాతం కలగకుండా కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించేందుకు అధికార యంత్రాంగం సన్నద్ధమవుతోంది.