Balakrishna On Basavatharakam Hospital In Amaravati: నందమూరి బాలకృష్ణ నటించిన ‘భగవంత్ కేసరి’ చిత్రం మహిళా సాధికారత అంశాన్ని ప్రధానంగా తీసుకొని రూపొందిన సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి జాతీయ స్థాయిలో పురస్కారం లభించడంపై బాలకృష్ణ సంతోషం వ్యక్తం చేశారు. అమ్మాయిలకు గుడ్ టచ్, బ్యాడ్ టచ్ అనే విషయంపై ఈ మూవీని తెరకెక్కించారు. ఈ నేపథ్యంలో ఈ సినిమాకు నేషనల్ అవార్డు రావడం పట్ల అందరూ హర్షం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో నందమూరి బాలకృష్ణ తీపి వార్త చెప్పారు. ఇదే సందర్భంగా అమరావతిలో ఈ నెల 13న బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రి నిర్మాణానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు భూమిపూజ చేయనున్నట్లు ప్రకటించారు. ఈ ఏర్పాట్లను బాలకృష్ణ తన సన్నిహితులు గాంధీ, సిద్ధాంతి నాగమల్లేశ్వరరావులతో కలిసి శనివారం పరిశీలించారు.
ఆస్పత్రి ప్రణాళికలపై సీఆర్‌డీఏ అదనపు కమిషనర్ ప్రవీణ్ బాలకృష్ణకు వివరించారు. మొత్తం 21 ఎకరాల విస్తీర్ణంలో ఈ ప్రాజెక్ట్ ఏర్పాటు చేయబడుతుందని, దీనిని మూడు దశల్లో పూర్తి చేయనున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా బాలకృష్ణ మాట్లాడుతూ, తన భవిష్యత్ సినిమాల్లో సామాజిక ప్రయోజనాలను ప్రతిబింబించే అంశాలు తప్పనిసరిగా ఉంటాయని చెప్పారు. హిందూపురం అభివృద్ధిపై దృష్టి సారిస్తున్నారని పేర్కొన్నారు. త్వరలోనే అక్కడ విస్తృతంగా పరిశ్రమలు, అంతర్‌రాష్ట్ర రహదారుల నిర్మాణానికి శ్రీకారం చుట్టనున్నట్లు వెల్లడించారు.


