Nara Lokesh Fire On New MLAs : ఉండవల్లి సీఎం క్యాంపు కార్యాలయంలో మంత్రులతో జరిగిన భేటీలో ఏపీ మంత్రి నారా లోకేశ్ అసహనం వ్యక్తం చేశారు. తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికైన కొంతమంది నేతలు మంచీ చెడు తెలియకుండా ప్రవర్తిస్తున్నారని మండిపడ్డారు. వారి తీరులో అనుభవం లేనితనం కొట్టొచ్చినట్లు కనిపిస్తోందని, సీనియర్ ఎమ్మెల్యేలు వారికి సరైన అవగాహన కల్పించాలని సూచించారు.
ALSO READ: Jubilee Hills: బస్తీల్లో ఏరులై పారుతున్న మద్యం.. ఎన్నికల అధికారికి బీఆర్ఎస్ ఫిర్యాదు
ఎమ్మెల్యేగా ఎన్నికైన కొత్తలో ఎదుర్కొన్న ఇబ్బందులు, వాటిని అధిగమించి ఈ స్థాయికి వచ్చారనే విషయాలను సీనియర్లు, మిగతా ఎమ్మెల్యేలకు వివరించాలని మంత్రి లోకేశ్ సూచించారు. “వరుస విజయాలు సాధించాలంటే లోటుపాట్లు సరిచేసుకోవాలి. అవగాహన లేకుండా ప్రవర్తిస్తే పార్టీకి, ప్రజలకు నష్టం” అని హెచ్చరించారు. ఈ ఎన్నికల్లో టీడీపీ-జనసేన కూటమి 164 స్థానాలు గెలుచుకుని అధికారంలోకి వచ్చింది. కొత్త ఎమ్మెల్యేలు 100కి పైగా ఉన్నారు. వారిలో కొందరు అనుభవాలు లేకుండా తప్పులు చేస్తున్నారని లోకేశ్ ఆందోళన వ్యక్తం చేశారు. సీనియర్లు వారిని మార్గదర్శకత్వం చేయాలని, ఇది పార్టీ ఐక్యతకు ఉపయోగపడుతుందని తెలిపారు.
ఈ సమావేశంలో నవంబర్ 14, 15 తేదీల్లో విశాఖపట్నంలో జరిగే సీఐఐ పెట్టుబడుల భాగస్వామ్య సదస్సును విజయవంతం చేయాలని మంత్రులకు లోకేశ్ పిలుపునిచ్చారు. “ఈ సదస్సు ద్వారా రూ.10 లక్షల కోట్ల పెట్టుబడులు వస్తాయి. ప్రతి మంత్రి తమ శాఖల్లో ఒప్పందాలపై బాధ్యత వహించాలి” అని సూచించారు. 3 వేల మంది పెట్టుబడిదారులు, విదేశీ రాయబారులు పాల్గొంటున్న ఈ సదస్సు ఏపీకు మైలురాయి అని, ఐటీ – పరిశ్రమలు, పర్యాటకం, గ్రీన్ ఎనర్జీ రంగాల్లో MoUలు రాబోతున్నాయని లోకేష్ తెలిపారు. ఈ సదస్సు ద్వారా 50 వేల మందికి ఉద్యోగాలు కల్పించే అవకాశం ఉందని తెలుస్తోంది.
మంగళవారం జరిగే MSME పార్కుల కార్యక్రమంలో తప్పకుండా పాల్గొనాలని మంత్రులకు లోకేశ్ ఆదేశాలు ఇచ్చారు. “ప్రజలకు ఇచ్చిన 20 లక్షల ఉద్యోగాల హామీని వేగంగా నెరవేర్చాలి. ఇది మన ప్రభుత్వం మొదటి ప్రాధాన్యత” అని చెప్పారు. లోకేశ్ IT, విద్యా శాఖల మంత్రిగా గూగుల్ డేటా సెంటర్, మైక్రోసాఫ్ట్ ప్రాజెక్టులు తీసుకువచ్చారు. ఈ అనుభవాన్ని ఇతర శాఖలకు విస్తరించే ప్రయత్నాలు చేస్తున్నారు.


