Vijayawada Dress Code:విజయవాడలోని ఇంద్రకీలాద్రి పర్వతంపై వెలసిన శ్రీ కనకదుర్గమ్మ ఆలయం ఆంధ్రప్రదేశ్‌లో అత్యంత ప్రసిద్ధి గాంచిన దేవాలయాలలో ఒకటి. ఇక్కడికి ప్రతిరోజూ వేలాది మంది భక్తులు దూరదూరాల నుండి వచ్చి అమ్మవారి దర్శనం పొందుతున్నారు. అయితే భక్తుల సౌకర్యం, భద్రత, మరియు ఆలయ పవిత్రతను కాపాడడమే లక్ష్యంగా దేవస్థానం నిర్వాహకులు ఇటీవల కొన్ని కొత్త నిబంధనలను ప్రవేశపెట్టారు. ఈ మార్పులు ఆగస్టు 29వ తేదీ నుంచి అమల్లోకి వచ్చాయి.
రెండు రోజుల క్రితమే..
వాస్తవానికి ఈ నిర్ణయాలను రెండు రోజుల క్రితమే అమలు చేయాలని అనుకున్నా, కొంత ఆలస్యంతో అవి ఈరోజు నుంచి ప్రారంభమయ్యాయి. కొత్త నియమాల ప్రకారం ఆలయానికి వచ్చే ప్రతి భక్తుడు సంప్రదాయ దుస్తులు ధరించి రావడం తప్పనిసరి. సంప్రదాయ వస్త్రధారణలో వచ్చిన వారికి మాత్రమే అమ్మవారి దర్శనం లభిస్తుంది. ఆధునిక లేదా అసభ్యకర దుస్తుల్లో వచ్చినవారికి అనుమతి ఇవ్వడం జరగదని అధికారులు స్పష్టం చేశారు.
ఆలయ పరిసరాల్లో మొబైల్ ఫోన్..
డ్రెస్ కోడ్ మాత్రమే కాదు, ఆలయ పరిసరాల్లో మొబైల్ ఫోన్ వాడకంపై కూడా పూర్తిగా నిషేధం విధించారు. భక్తులు మాత్రమే కాదు, ఆలయంలో విధులు నిర్వహించే సిబ్బందికి కూడా ఈ నిబంధన కచ్చితంగా వర్తిస్తుంది. ప్రత్యేకంగా ప్రోటోకాల్ దర్శనాలకు వచ్చే వారు తమ మొబైల్ ఫోన్లను ఆలయ కార్యాలయంలో డిపాజిట్ చేయాలని ఆదేశాలు జారీ అయ్యాయి.
సెల్ఫీలు, వీడియోలు..
ఇటీవలి కాలంలో ఆలయం లోపల సెల్ఫీలు తీసుకోవడం, వీడియోలు రికార్డ్ చేసి సామాజిక మాధ్యమాల్లో పంచుకోవడం ఎక్కువైపోవడంతో ఈ నియమాన్ని ఖచ్చితంగా అమలు చేయాలని నిర్ణయించారు. దేవస్థానం అధికారులు తెలిపిన వివరాల ప్రకారం, పవిత్ర ఆలయ వాతావరణాన్ని భంగం కలిగించే చర్యలకు అస్సలు అవకాశం ఉండదని, నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.
అదేవిధంగా, ఆలయంలో పనిచేసే ప్రతి సిబ్బంది ఎప్పుడూ తమ గుర్తింపు కార్డు వెంట ఉంచుకోవాలని ఈవో ఆదేశించారు. భద్రతా చర్యలలో భాగంగా స్కానింగ్ సెంటర్ , టికెట్ కౌంటర్ వద్ద కఠినమైన తనిఖీలు జరుగుతాయి. ఎవరికైనా డ్రస్ కోడ్ పాటించకపోతే లేదా మొబైల్ ఫోన్ తీసుకుని వస్తే వారికి ఆలయంలోకి ప్రవేశం నిరాకరిస్తారు.
ఈ మార్పులతో పాటు ఆలయ పరిసరాల్లో మరింత క్రమశిక్షణ నెలకొనేలా అధికారులు చర్యలు చేపట్టారు. భక్తులందరూ పవిత్ర వాతావరణంలో అమ్మవారి దర్శనం పొందాలని, కొత్త నిబంధనలను ఎవరూ విస్మరించరాదని విజ్ఞప్తి చేస్తున్నారు.


