Jr Ntr Controversy: అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్ జూనియర్ ఎన్టీఆర్‌ను దూషిస్తున్న ఆడియో ఒకటి బయటకు వచ్చి తీవ్ర చర్చకు దారితీసింది. ఆ ఆడియోలో ఎమ్మెల్యే, ఎన్టీఆర్‌ను బూతులు తిడుతూ, ఆయన తాజా చిత్రం ‘వార్ 2’ ప్రదర్శనలను అనంతపురంలో నిలిపివేయాలని హెచ్చరించారు. ఈ సంఘటన జూనియర్ ఎన్టీఆర్ అభిమానుల ఆగ్రహానికి కారణమైంది. ఒక ప్రజాప్రతినిధి ఇలాంటి అసభ్యకరమైన భాషను ఉపయోగించడంపై వారు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.
అభిమానుల ఆరోపణలు
ఈ సంఘటనను జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు ఒక రాజకీయ కక్ష సాధింపు చర్యగా ఆరోపిస్తున్నారు. నందమూరి కుటుంబానికి, ముఖ్యంగా నారా చంద్రబాబు కుటుంబానికి ఎన్టీఆర్ దూరంగా ఉన్నారని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో, అధికార కూటమిలో ఉన్న ఒక ఎమ్మెల్యే ఇలాంటి వ్యాఖ్యలు చేయడం రాజకీయంగా ఆసక్తికరంగా మారింది. కూటమి ప్రభుత్వం అండదండలతోనే ఎమ్మెల్యే వెంకటేశ్వర ప్రసాద్ ఇంత ధైర్యంగా ప్రవర్తించారని అభిమానులు ఆరోపిస్తున్నారు.
చంద్రబాబు సీరియస్
ఈ ఘటనపై సీఎం చంద్రబాబు సీరియస్ అయినట్టు తెలుస్తోంది. పార్టీకి చెడ్డ పేరు వచ్చే చర్యలను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోమని ఆయన స్పష్టం చేశారు.అనంతపురం ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలు పార్టీ ఇమేజ్‌కి తీవ్ర నష్టం చేస్తాయని సీఎం అభిప్రాయపడ్డారు.భవిష్యత్తులో ఇలాంటి తప్పులు పునరావృతం కాకుండా క్రమశిక్షణా చర్యలకు వెనుకాడబోమని హెచ్చరించారు.
ఎమ్మెల్యే వివరణ
ఈ ఆడియోపై ఎమ్మెల్యే దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్ స్పందించారు. వైరల్ అవుతున్న ఆడియో కాల్ తనది కాదని ఆయన ఖండించారు. ఇది తనపై జరుగుతున్న రాజకీయ కుట్రలో భాగమని, గత 16 నెలలుగా తనపై ఇలాంటి కుట్రలు జరుగుతున్నాయని పేర్కొన్నారు. తాను మొదటి నుంచి నందమూరి కుటుంబానికి అభిమానిని అని, అందుకే ఆ ఆడియో అబద్ధమని తెలిపారు. ఈ విషయమై ఇప్పటికే జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేసినట్లు ఆయన వెల్లడించారు.


