ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణానికి మరో అడుగు పడనుంది. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ మే 2వ తేదీన అమరావతిలో పునర్నిర్మాణ పనులకు శంకుస్థాపన చేయనున్నారని అధికారికంగా ప్రకటించారు. ఇందుకు సంబంధించిన షెడ్యూల్‌ను రాష్ట్ర ప్రభుత్వం ఖరారు చేసింది. మరోవైపు దీని కోసం శరవేగంగా ఏర్పాట్లు కొనసాగుతున్నాయి.
ప్రధాని మోడీ మే 2వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు గన్నవరం విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడి నుంచి హెలికాప్టర్‌లో ప్రయాణించి 3.30 గంటలకు అమరావతిలోని ప్రత్యేక హెలిప్యాడ్‌కు చేరుకుంటారు. అక్కడి నుంచి 1.1 కిలోమీటర్ల దూరం వరకు రోడ్డు షోలో పాల్గొంటారు. ఈ రోడ్డు షో సుమారు 15 నిమిషాల పాటు సాగనుంది. అనంతరం 3.45 గంటల నుంచి 4 గంటల వరకు అమరావతి పెవిలియన్‌ను ప్రధాని సందర్శిస్తారు.
సాయంత్రం 4 గంటలకు సచివాలయం వెనక ఏర్పాటు చేసిన బహిరంగ సభ వేదిక వద్ద ప్రధాన కార్యక్రమం ప్రారంభమవుతుంది. ప్రధాని మోడీ రాజధాని పునర్నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసి, బహిరంగ సభలో ప్రసంగిస్తారు. ఈ సభ సుమారు గంటపాటు జరుగనుంది.
కార్యక్రమం ముగిసిన వెంటనే సాయంత్రం 5.10 గంటలకు మోడీ హెలికాప్టర్ ద్వారా తిరిగి గన్నవరం విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడి నుంచి 5.20 గంటలకు ఢిల్లీ వెళ్లేందుకు బయల్దేరుతారు. ప్రధాని పర్యటన సజావుగా సాగేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రత్యేక మంత్రుల కమిటీని ఏర్పాటు చేసింది. ప్రధాని పర్యటన నేపథ్యంలో అమరావతిలో భద్రతా ఏర్పాట్లతో పాటు ఇతర ఏర్పాట్లు జోరుగా కొనసాగుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ఈ వేడుకను ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించేందుకు కసరత్తు చేస్తోంది.