Quantum Valley in Amaravati: నేషనల్ క్వాంటం మిషన్ ప్రణాళికలో భాగంగా అమరావతిలో ఏర్పాటు చేయనున్న “క్వాంటం వ్యాలీ”కి గణనీయమైన మద్దతు లభించింది. ప్రముఖ సంస్థ QPIAI (Quantum Predictive and Intelligence AI) ఇందులో భాగస్వామిగా చేరనుంది. అత్యాధునిక 8 క్యూబిట్ సామర్థ్యం గల క్వాంటం కంప్యూటర్లను ఏర్పాటు చేయడానికి ఈ సంస్థ ముందుకు వచ్చింది.
ఇప్పటికే దీనిపై QPIAI వ్యవస్థాపకుడు నాగేంద్ర నాగరాజన్, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో అమరావతి సచివాలయంలో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ, ప్రజల అవసరాలకు అనుగుణంగా ప్రయోజనకరమైన ఆవిష్కరణలు జరిగేలా, విద్యార్థుల పరిశోధనలకు ప్రోత్సాహమిచ్చేలా ఈ కేంద్రాన్ని అభివృద్ధి చేయాలని సూచించారు. అమరావతిలో Center of Excellence for Quantum Technologiesను స్థాపించాలన్న సీఎం విజన్‌ను కూడా ఈ సందర్భంగా వెల్లడించారు. వ్యవసాయ రంగానికి సంబంధించి పంటల పరిస్థితి, తెగుళ్ల ప్రభావాన్ని ఖచ్చితంగా అంచనా వేయడంలో క్వాంటం టెక్నాలజీ ఎంతో సహాయపడుతుందని సీఎం అభిప్రాయపడ్డారు. దీనివల్ల రైతులకు సరైన సమయంలో సలహాలు అందించి వారి ఆదాయాన్ని పెంచే అవకాశం ఉందన్నారు.
అలాగే, నీటి వనరులను సమర్థంగా వినియోగించడంలో కూడా క్వాంటం కంప్యూటింగ్ వనరుల్ని సమర్ధవంతంగా ఉపయోగించవచ్చని అన్నారు. ఆరోగ్య రంగంలో వ్యాధుల నిర్ధారణ, మెడికల్ లాజిస్టిక్స్ వ్యవస్థల మెరుగుదల వంటి అంశాల్లో క్వాంటం సిమ్యులేషన్ ముఖ్యపాత్ర వహించగలదని చంద్రబాబు వివరించారు. రాష్ట్రంలోని యువతను కొత్త సాంకేతికతలపై నైపుణ్యాలతో తయారుచేయాలన్న దృష్టితో ప్రభుత్వం క్వాంటం రంగంలో శిక్షణ కార్యక్రమాలను రూపొందించే దిశగా అడుగులు వేస్తుందని సీఎం తెలిపారు. కొత్త ఉద్యోగ అవకాశాలు, పరిశోధన అవకాశాలు ఏర్పడేలా ఈ టెక్నాలజీ కీలకంగా మారనుందని ఆయన అభిప్రాయపడ్డారు.


