Pilli Satyanarayana Murthy: ఉమ్మడి గోదావరి జిల్లాల్లో అధికార కూటమిలో కీలక భాగస్వాములైన తెలుగుదేశం, జనసేన పార్టీల మధ్య వర్గపోరు మొదలైనట్లు తెలుస్తోంది. పిల్లి సత్యనారాయణ మూర్తి అలియాస్ సత్తిబాబు, కాకినాడ రూరల్ నియోజకవర్గ టీడీపీ కోఆర్డినేటర్ పదవికి రాజీనామా చేయడంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ఆయన తన రాజీనామా పత్రాన్ని నేరుగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి పంపించారు.
ఆరోపణలు, అసంతృప్తి వెనుక కారణాలు
జనసేన ఎమ్మెల్యే పంతం నానాజీ ప్రాతినిధ్యం వహిస్తున్న ఈ నియోజకవర్గంలో టీడీపీ కార్యకర్తలను పట్టించుకోవడం లేదని సత్తిబాబు ఆరోపించారు. ఎన్నికల సమయంలో నానాజీ విజయం కోసం తమతో సహా, టీడీపీ కార్యకర్తలు తీవ్రంగా కృషి చేశారని, దీనివల్లే ఆయన 72,000లకు పైగా మెజారిటీతో గెలుపొందారని పేర్కొన్నారు. అయితే, ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత నానాజీ టీడీపీ కార్యకర్తలను పూర్తిగా నిర్లక్ష్యం చేస్తున్నారని, వారిని జనసేన అధ్యక్షుడి వద్దకు పంపుతున్నారని ఆయన ఆరోపించారు. ఈ వ్యవహారం వల్ల టీడీపీ కార్యకర్తలు తీవ్ర మనస్తాపానికి గురై, పార్టీకి దూరమవుతున్నారని సత్తిబాబు ఆవేదన వ్యక్తం చేశారు.
’50-50′ నినాదానికి నిలబడలేదా?
ఎన్నికల ప్రచారంలో టీడీపీ-జనసేన మధ్య ’50-50′ భాగస్వామ్యం ఉంటుందని ప్రజలకు హామీ ఇచ్చామని, కానీ ఇప్పుడు ఆ హామీ అమలు కావడం లేదని సత్తిబాబు పేర్కొన్నారు. ఈ విషయాలను ముఖ్యమంత్రి, జిల్లా ఇంచార్జ్ మంత్రి నారాయణ దృష్టికి నాలుగు సార్లు తీసుకెళ్లినా ఫలితం లేకపోవడంతోనే తాను ఈ నిర్ణయం తీసుకున్నానని తెలిపారు.
సీఎం చంద్రబాబు, పవన్ కల్యాణ్, లోకేశ్‌తో ఆర్టీసీ బస్సు ప్రయాణం.. స్త్రీ శక్తి పథకం ఘన ప్రారంభం
గోదావరి జిల్లాల్లో కాపు ఓటు బ్యాంకు బలంగా ఉండడంతో, జనసేన ఇక్కడ పెత్తనం చెలాయించడానికి ప్రయత్నిస్తోందని టీడీపీ నాయకుల్లో ఒక అభిప్రాయం బలంగా వినిపిస్తోంది. ఈ ఘటన కూటమిలో అంతర్గత విభేదాలు ఏ స్థాయిలో ఉన్నాయో స్పష్టం చేస్తోంది. ప్రభుత్వం ఈ సమస్యను ఎలా పరిష్కరిస్తుందో చూడాలి.


