YS Jagan Mohan Reddy: వైఎస్ జగన్ వైఎస్ఆర్సీపీ పార్టీ అధినేత. మెున్నటిసారి జరిగిన ఏపీ ఎన్నికల్లో పార్టీ ఓటమిపాలు కావటంతో ప్రస్తుతం ఆయన ప్రతిపక్ష హోదాను కూడా పొందలేక పోయారు. అయితే ప్రస్తుతం జగన్ వైఖరి ఆయనను వచ్చే సారి ఎన్నికల్లో తిరిగి పోటీ చేయటానికి అవరోధంగా మారుతుందా అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. అయితే టీడీపీ వర్గాలు దీనిపై చేస్తున్న కామెంట్స్.. పరోక్షంగా జగన్ కు వారు చేస్తున్న సూచనల్లో అసలు విషయం ఏంటనేది ఇప్పుడు తెలుసుకుందాం…
పులివెందుల ఎమ్మేల్యేగా ఉన్న వైఎస్ జగన్ అసెంబ్లీకి రాకుండా బహిష్కరిస్తామని చేసిన ప్రకటన అనర్హత పరిధిలోకి వస్తుందని టీడీపీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడు చెప్పారు. ఎమ్మెల్యేలు వరుసగా 60 రోజులపాటు సభకు హాజరు కాకుంటే వారిపై అనర్హత వేటు వేయవచ్చని రాజ్యాంగ నిబంధనలు చెబుతున్న విషయాన్ని యనమల గుర్తుచేశారు. దీనిపై కావాలంటే జగన్ తన లీగల్ టీమ్ నుంచి ఒపీనియన్ తీసుకోవచ్చని అన్నారు. అనర్హత వేటు నిబంధనలపై జగన్ స్పందించిన తీరు హాస్యాస్పదంగా ఉందంటూ మీడియాతో మాట్లాడుతూ కామెంట్ చేశారు.
రాజ్యాంగంలోని ఆర్టికల్ 188, 190(4) పరిశీలిస్తే జగన్ కే విషయం అర్థం అవుతుందని యనమల అన్నారు. వైఎస్ జగన్ తన హయాంలో పరిపాలనలో విఫలం కావటం వల్లనే 2024లో 11 స్థానాలకు వైసీపీ పరిమితమైందని యనమల అన్నారు. ప్రజలు కనీసం ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వకుండా అందుకే వైసీపీని ఎన్నికల్లో చిత్తుచిత్తుగా ఓడించారని చెప్పారు. గతంలో తమకు ప్రతిపక్ష హోదా ఇస్తేనే అసెంబ్లీకి వస్తామంటూ జనగ్ స్పీకర్ అయ్యన్న పాత్రుడికి లేఖ రాశారని.. కానీ హోదా అసెంబ్లీ నిబంధనలకు అనుగుణంగా ఇవ్వబడుతుందని జగన్ గ్రహించాలని అన్నారు. అయితే ప్రస్తుతం ఈ మ్యాటర్ ఏపీ హైకోర్టులో ఉన్న సంగతి తెలిసిందే.
మెుత్తానికి ఎమ్మేల్యేలు వరుసగా 60 రోజుల పాటు అసెంబ్లీకి రాకుంటే అనర్హత వేటు వేయెుచ్చని నిబంధనలు చెబుతున్నానయని యనమల అన్నారు. అలాగే తర్వాతి ఎన్నికల్లో పోటీకి అర్హతపై కోర్టు తేల్చాల్సి ఉంటుందని చెప్పారు యనమల.


