Hyderabad Vijayawada highway:దేశంలో అత్యంత రద్దీగా ఉండే జాతీయ రహదారుల్లో హైదరాబాద్ నుంచి విజయవాడకు వెళ్లే ఎన్ హెచ్ 65 ఒకటి. సంక్రాంతి పండుగ సమీపించగానే పెద్ద ఎత్తున నగరవాసులు తమ సొంత గ్రామాల వైపు ప్రయాణం చేయడంతో హైదరాబాద్ నగరం మూడు రోజుల పాటు ప్రశాంతంగా మారింది. అదే సమయంలో జాతీయ రహదారులపై వాహనాల సంఖ్య గణనీయంగా పెరిగింది.
మూడు లక్షల వాహనాలు..
సంక్రాంతి సెలవుల కోసం హైదరాబాద్ నుంచి విజయవాడ దిశగా మూడు రోజుల్లో సుమారు మూడు లక్షల వాహనాలు ప్రయాణించినట్లు అధికారిక లెక్కలు చెబుతున్నాయి. పండుగ వేడుకలు ముగియడంతో ఇప్పుడు అదే స్థాయిలో వాహనాలు తిరిగి హైదరాబాద్ వైపు కదులుతున్నాయి. దీని కారణంగా హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై మళ్లీ ట్రాఫిక్ ఒత్తిడి పెరిగే పరిస్థితి ఏర్పడింది.
తీవ్ర వాహన రద్దీ..
పండుగకు ముందు రోజులలోనే హైవే మీద తీవ్ర వాహన రద్దీ ఏర్పడింది. పలుచోట్ల గంటల తరబడి వాహనాలు నిలిచిపోయాయి. కుటుంబాలతో ప్రయాణిస్తున్న వారు తీవ్ర అసౌకర్యాన్ని ఎదుర్కొన్నారు. ఈ అనుభవాలను దృష్టిలో పెట్టుకొని తిరుగు ప్రయాణ సమయంలో ఇలాంటి సమస్యలు పునరావృతం కాకుండా పోలీసులు ముందస్తు ప్రణాళికను అమలు చేస్తున్నారు.
ట్రాఫిక్ నిలిచిపోయే అవకాశాలు..
ప్రస్తుతం హైదరాబాద్ కు వచ్చే ప్రధాన ప్రవేశ మార్గమైన ఎన్ హెచ్ 65పై కొన్ని కీలక ప్రాంతాల్లో ఫ్లైఓవర్లు, అండర్ పాస్‌లు, వంతెనల నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి. ఈ పనుల కారణంగా అక్కడ వాహనాల గమనాన్ని నియంత్రించాల్సిన అవసరం ఏర్పడింది. ముఖ్యంగా బ్లాక్ స్పాట్స్ గా గుర్తించిన ప్రాంతాల్లో ట్రాఫిక్ నిలిచిపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు.
ఇదే సమయంలో అద్దంకి నార్కెట్‌పల్లి రహదారి నుంచి వచ్చే వాహనాలు నార్కట్‌పల్లి వద్ద ఎన్ హెచ్ 65ను కలుస్తాయి. తిరుగు ప్రయాణంలో రెండు తెలుగు రాష్ట్రాల నుంచి వాహనాలు ఒకేసారి హైదరాబాద్ దిశగా రావడంతో నార్కట్‌పల్లి పరిసర ప్రాంతాల్లో అదనపు ఒత్తిడి ఏర్పడే అవకాశం ఉంది.
ఈ పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై ట్రాఫిక్ రద్దీ తగ్గించేందుకు పోలీసులు ప్రత్యేక మార్గ మళ్లింపు చర్యలు చేపట్టారు. ఆంధ్రప్రదేశ్ నుంచి హైదరాబాద్ వచ్చే వాహనదారులు సూచించిన ప్రత్యామ్నాయ మార్గాలను వినియోగించాలని ట్రాఫిక్ అధికారులు కోరుతున్నారు.
గుంటూరు ప్రాంతం నుంచి..
గుంటూరు ప్రాంతం నుంచి హైదరాబాద్ వెళ్లే వాహనాలు మిర్యాలగూడ, హాలియా, కొండమల్లేపల్లి, చింతపల్లి, మాల్ మార్గంలో ప్రయాణించేలా సూచనలు ఇచ్చారు. అదే విధంగా మాచర్ల నుంచి వచ్చే వాహనాలకు నాగార్జునసాగర్, పెద్దవూర, కొండమల్లేపల్లి, చింతపల్లి, మాల్ మార్గాన్ని వినియోగించుకోవాలని తెలిపారు.
నల్లగొండ జిల్లా నుంచి..
నల్లగొండ జిల్లా నుంచి హైదరాబాద్ వైపు వెళ్లే వాహనాలు మర్రిగూడ బైపాస్, మునుగోడు, నారాయణపూర్ మీదుగా చౌటుప్పల్ వద్ద ఎన్ హెచ్ 65లోకి చేరే విధంగా మార్గనిర్దేశం చేస్తున్నారు. ఈ మార్గాల ద్వారా వెళ్లడం వల్ల ప్రధాన రహదారిపై వాహనాల ఒత్తిడి తగ్గుతుందని అధికారులు చెబుతున్నారు.
విజయవాడ నుంచి..
విజయవాడ నుంచి హైదరాబాద్ వైపు వచ్చే భారీ వాహనాలకు ప్రత్యేకంగా మరో మార్గాన్ని సూచించారు. కోదాడ, హుజూర్‌నగర్, మిర్యాలగూడ, హాలియా, చింతపల్లి, మాల్ మీదుగా హైదరాబాద్ చేరుకునేలా ట్రాఫిక్ డైవర్షన్ అమలు చేస్తున్నారు.
అదేవిధంగా ఎన్ హెచ్ 65పై చిట్యాల, పెద్దకాపర్తి ప్రాంతాల్లో నిర్మాణ పనుల కారణంగా ట్రాఫిక్ నిలిచిపోయిన పరిస్థితి ఏర్పడితే, అక్కడి నుంచి భువనగిరి దిశగా వాహనాలను మళ్లించే ఏర్పాట్లు చేసినట్లు పోలీసులు వెల్లడించారు.ప్రత్యామ్నాయ మార్గాల వినియోగంతో ప్రధాన విజయవాడ హైదరాబాద్ జాతీయ రహదారిపై వాహనాల రద్దీ తగ్గి, ప్రయాణికులు తమ గమ్యస్థానాలకు వేగంగా మరియు సురక్షితంగా చేరుకునే అవకాశం ఉంటుందని అధికారులు అభిప్రాయపడుతున్నారు.
తిరుగు ప్రయాణంలో నగరవాసులు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోకుండా హైదరాబాద్ చేరుకోవడమే తమ ప్రధాన లక్ష్యమని పోలీసులు స్పష్టం చేస్తున్నారు. ముందస్తు ప్రణాళికతో ట్రాఫిక్ నియంత్రణ చర్యలు అమలు చేస్తున్నామని సూర్యాపేట, నల్లగొండ జిల్లాల పోలీసు అధికారులు తెలిపారు.
డ్రోన్ కెమెరాలు, సీసీటీవీ కెమెరాల..
హైవే పై ట్రాఫిక్ పరిస్థితిని ఎప్పటికప్పుడు గమనించేందుకు డ్రోన్ కెమెరాలు, సీసీటీవీ కెమెరాల ద్వారా పర్యవేక్షణ కొనసాగిస్తున్నట్లు తెలిపారు. ఏదైనా అత్యవసర పరిస్థితి ఎదురైతే వెంటనే డయల్ 100కు సమాచారం ఇవ్వాలని సూచించారు.

