Dasara-Vijayawada:విజయవాడ శ్రీ కనకదుర్గ అమ్మవారి ఆలయంలో ఈ ఏడాది దసరా ఉత్సవాలు అక్టోబర్ ఒకటో తేదీతో ముగిశాయి. ప్రతి సంవత్సరం విజయదశమి రోజు నిర్వహించే ముఖ్యమైన తెప్పోత్సవం ఈసారి జరగలేదు. కృష్ణానదిలో వరదలు పెరగడంతో అధికారులు భక్తుల భద్రతను దృష్టిలో పెట్టుకుని ఈ కార్యక్రమాన్ని రద్దు చేశారు.
విజయదశమి రోజున..
దుర్గగుడి ఈవో శీనా నాయక్ వివరాల ప్రకారం, ములా నక్షత్రం రోజున ఎలా దర్శన ఏర్పాట్లు చేసినారో, విజయదశమి రోజున కూడా అదే విధంగా కొనసాగించారు. అన్ని క్యూ లైన్లలో ఉచిత దర్శనానికి అవకాశం కల్పించారు. భక్తుల రద్దీ అధికంగా ఉన్నందున గురువారం జరిగే విఐపి, ప్రోటోకాల్ దర్శనాలను పూర్తిగా నిలిపివేశారు.
కృష్ణా నది ఉధృతి ఎక్కువగా ఉండడంతో అమ్మవారి జలవిహారం జరగలేదని అధికారులు తెలిపారు. అయితే శివాలయం నుంచి దుర్గా ఘాట్ వరకు శాస్త్రోక్త పద్ధతిలో ఊరేగింపును నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
భక్తుల సంఖ్య భారీగా ఉండడంతో, దర్శనాల కోసం తెల్లవారుఝామునే రెండు గంటల నుంచి ఆలయంలోకి అనుమతి ఇచ్చారు. విజయదశమి సందర్భంగా ప్రతి ఒక్క భక్తుడికి ఉచితంగా లడ్డూ ప్రసాదాన్ని అందించారు.
ఆదాయ వివరాలు
ఉత్సవాల పదవ రోజు బుధవారం సాయంత్రం ఐదు గంటల వరకు ఆలయానికి మొత్తం రూ.62 లక్షల 16 వేల 970 రూపాయల ఆదాయం వచ్చినట్లు ఈవో ప్రకటించారు. లడ్డూ అమ్మకాలే ప్రధాన ఆదాయ వనరుగా నిలిచాయి. రూ.15 విలువ గల లడ్డూలు 12,847 అమ్ముడై దాదాపు రూ.1,92,705 లభించగా, రూ.100 విలువ గల లడ్డు బాక్స్‌లు 54,705 విక్రయమై రూ.54,70,500 చేరాయి.
దీనితో పాటు ప్రత్యేక పరోక్ష కుంకుమార్చన ద్వారా 36 వేల రూపాయలు, చండిహోమం ద్వారా 24 వేల రూపాయలు, ఖడ్గమాల ఆర్చన ద్వారా 20,464 రూపాయలు వచ్చినట్లు తెలిపారు. ఆలయ ఫోటోలు, క్యాలెండర్ల విక్రయం ద్వారా 6,170 రూపాయలు, కేశఖండన సేవల ద్వారా రూ.4,58,720, ఇతర విభాగాల ద్వారా 8,411 రూపాయలు వచ్చాయి.
భక్తుల రద్దీ
బుధవారం సాయంత్రం వరకు 85,094 మంది భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారని అధికారులు తెలిపారు. చిన్నపిల్లలు తప్పిపోకుండా ఉండేందుకు 5,042 ట్యాగ్‌లు వేసారు. అన్నప్రసాదం రూపంలో 25,533 మందికి భోజనం అందించారు. ఇప్పటివరకు ఉత్సవ కాలంలో 17,29,057 లడ్డూలు విక్రయించారని ఈవో వివరించారు.
చంద్రబాబు శుభాకాంక్షలు
విజయదశమి సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ఆయన కనకదుర్గమ్మ ఆశీస్సులు అందరిపై ఉండాలని ఆకాంక్షించారు. నవరాత్రుల్లో అమ్మవారి తొమ్మిది అవతారాలను దర్శించడం భక్తులకు దివ్యానుభూతి కలిగిందని పేర్కొన్నారు.
Also Read: https://teluguprabha.net/devotional-news/significance-of-rituals-and-donations-on-dussehra-day/
చంద్రబాబు తన సందేశంలో, ప్రజల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను ప్రస్తావించారు. పేదల భోజనానికి అన్నక్యాంటీన్లు, మహిళలకు దీపం, ఉచిత బస్సు ప్రయాణానికి స్త్రీశక్తి, విద్యకు తల్లికి వందనం, రైతుల కోసం అన్నదాత సుఖీభవ, అభివృద్ధి కోసం పీ4 విధానం, పారిశ్రామిక అభివృద్ధి వంటి పథకాలు ప్రజల జీవితాల్లో వెలుగులు నింపాలని ఆకాంక్షించారు. చివరగా అందరికీ విజయదశమి శుభాకాంక్షలు తెలిపారు.


