Andhra Suicide News: కృష్ణా జిల్లా ఉయ్యూరు పట్టణంలో ఇటీవల చోటు చేసుకున్న ఓ సంఘటన ప్రజలను దిగ్భ్రాంతికి గురి చేసింది. పెళ్లై కొన్ని నెలలకే దంపతుల మధ్య మనస్పర్థలు పెరిగి చివరకు విషాదంగా మారాయి. వివరాల్లోకెళ్తే.. పట్టణానికి చెందిన శ్రీవిద్య(వయసు 24), ప్రైవేటు కాలేజీలో అధ్యాపకురాలిగా పని చేస్తూ ఉన్న ఆమె, ఇటీవలే రాంబాబు అనే వ్యక్తితో వివాహం చేసుకుంది. రాంబాబు ఉయ్యూరు మండలం కలవపాముల గ్రామానికి చెందిన వ్యక్తి, విలేజ్ సర్వేయర్‌గా పనిచేస్తున్నాడు.
పెళ్లైన నెల రోజులకే శ్రీవిద్య పై దౌర్జన్యాలు మొదలయ్యాయని సమాచారం. ఆమెపై భర్త మానసిక, శారీరక వేధింపులకు పాల్పడ్డట్టు బాధితురాలి కుటుంబ సభ్యులు చెబుతున్నారు. పలు సందర్భాల్లో శ్రీవిద్యను గట్టిగా కొట్టడం, అందరి ముందు అవమానించడం జరుగుతుండేదట. శ్రీవిద్య తల్లిదండ్రుల సమాచారం మేరకు, ఆమె తన భర్త వేధింపులను ఎంతోకాలం మౌనంగా భరించిందట. అయితే, పరిస్థితులు మరింత వేగంగా దిగజారడంతో, ఇంట్లో ఎవరూ లేని సమయంలో శ్రీవిద్య ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. శ్రీవిద్య తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
శ్రీవిద్య సూసైడ్ నోట్ – భావోద్వేగంతో నిండిన మాటలు
ఆమె మరణానికి ముందు రాసిన సూసైడ్ నోట్‌లో, భర్త రాంబాబు చేసిన హింసలను వివరించింది. ‘‘తన భర్త రోజూ తాగి వస్తాడని, తలనొప్పి వచ్చేలా కొట్టేవాడని, జుట్టు పట్టుకొని మంచంపై పడేయడం వంటి దారుణాలు భరించలేకపోతున్నాను’’ అంటూ చెప్పింది. ‘‘రాఖీ పండుగకు ఉండకపోవచ్చు.. నాన్న అంటే నాకు ధైర్యం.. ఈ స్థితికి కారణమైన నా భర్తను వదిలిపెట్టకండి’’ అంటూ కన్నీటి మాటలు నోటులో వ్యక్తమయ్యాయి. ఇంకా ఒక అమ్మాయి ముందు తనను తక్కువ చేసి మాట్లాడిన విషయాన్ని ఆమె మరిచిపోలేకపోతున్నట్టు, తలపై, వీపుపై దాడులకు పాల్పడ్డాడని పేర్కొంది. చదువుకునే సమయంలో పేపర్లను పీకేసి పక్కకు విసిరేసిన సంఘటనను కూడా వివరించింది. ‘‘తమ్ముడా.. ఈసారి నీకు రాఖీ కట్టలేకపోతున్నాను.. అమ్మ, నాన్నను చూసుకో’’ అంటూ తమ్ముడికి చివరి సందేశం రాసింది. ప్రస్తుతం ఆమె మాటలు.. ఆమె రాసిన ఉత్తరం చదువుతున్న వారిని కన్నీటి పర్యంతానికి గురి చేస్తోంది. ఇలాంటి దుర్ఘనటలు జరగడం తీవ్ర బాధాకరమని పలువురు అభిప్రాయపడుతున్నారు. కాలం మారుతున్న కొద్దీ మనుషులలో పరివర్తన రావడం లేదని.. దారుణాతిదారుణమైన ఘటనలకు పాల్పడుతున్నారని ఆరోపిస్తున్నారు. ఇకనైనా సమాజంలో ప్రతిఒక్కరి పట్ల గౌరవం పెరగాలని ఆకాంక్షిస్తున్నారు.


