Anitha Jagan criticism : మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై హోం మంత్రి అనిత, మహిళా మంత్రి గుమ్మిడి సంధ్యారాణి తీవ్ర విమర్శలు గుప్పించారు. “జగన్ నీకు సిగ్గుందా?” అంటూ అనిత సంచలన వ్యాఖ్యలు చేశారు.
తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడిన హోం మంత్రి అనిత, జగన్ తన పాలనలో యువతను డ్రగ్స్, గంజాయి బానిసలుగా మార్చారని ఆరోపించారు. 2019-2024 మధ్య దేశవ్యాప్తంగా గంజాయి సీజ్ అయినప్పుడు, దాని మూలాలు ఏపీలోనే ఉన్నాయని చెప్పకుండా ఉండలేని పరిస్థితి ఏర్పడిందని తెలిపారు.
అన్నపూర్ణ ఆంధ్రాన్ని గంజాయి ఆంధ్రాగా మార్చిన ఘనత జగన్‌కే సొంతమని అనిత వ్యాఖ్యానించారు. స్కూలు పిల్లల బ్యాగుల్లోకి కూడా గంజాయి చేర్చారని ఆరోపణలు చేశారు. “జగన్ అధికారంలో ఉన్నప్పుడు డ్రగ్స్, గంజాయిపై ఒక్క సమీక్ష కూడా చేయలేదు కాబట్టి ఇప్పుడు యువత భవిష్యత్తుపై మాట్లాడే హక్కు ఆయనకు లేదని” మండిపడ్డారు. డ్రగ్స్ దందా చేసిన వారికి జగన్ వత్తాసు పలుకుతారా? అంటూ తీవ్రంగా ఖండించారు. తాము అధికారంలోకి వచ్చిన తర్వాత ‘ఈగల్’ బృందం స్థాపించి, ఏడాదిన్నరలో జీరో గంజాయి రాష్ట్రంగా మార్చామని తెలిపారు. “డ్రగ్స్ వద్దు బ్రో” నినాదాన్ని స్కూల్ స్థాయికి తీసుకెళ్తున్నామని చెప్పారు. ఈ కార్యక్రమాలు యువతను రక్షించడంలో కీలక పాత్ర పోషిస్తుందని అనిత తెలిపారు.
మరోవైపు, విశాఖపట్నంలో మంత్రి గుమ్మిడి సంధ్యారాణి విలేకరులతో మాట్లాడారు. ఈ నెల 14, 16 తేదీల్లో విశాఖలో జరిగే భాగస్వామ్య సదస్సు రాష్ట్రానికి రూ.10 లక్షల కోట్ల పెట్టుబడులు తీసుకువస్తుందని ప్రకటించారు. ఇది ఉత్తరాంధ్ర అభివృద్ధిని మలుపు తిప్పుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. “రాష్ట్రానికి మేలు జరుగుతుంటే కుట్రలతో అడ్డుకోవాలని జగన్ చూస్తున్నాడా?” అంటూ ధ్వజం ఎత్తారు. రైతు పరామర్శల పేరుతో జగన్ చేసిన విన్యాసాలు చూసి ప్రజలు నవ్వుకుంటున్నాయని విమర్శించారు. “జగన్, నువ్వు మాట్లాడే ముందు వాస్తవాలు తెలుసుకోవాలి” అని హితవు పలికారు. చంద్రబాబు నాయుడు ప్రభుత్వం రైతులకు రుణ మాఫీ, 3,000 ఆర్జీఫ్, రైస్ పంపిణీ వంటి సంక్షేమాలు అమలు చేస్తోందని సంధ్యారాణి ప్రశంసించారు.


