YSRCP Leaders Meet Undavalli: ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాది కావస్తోంది. ఈ సమయంలో వైసీపీని లక్ష్యంగా చేసుకుని కూటమి ప్రభుత్వం ముందుకు వెళ్తున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా, మద్యం కుంభకోణం కేసులో సిట్టింగ్ ఎంపీ మిథున్ రెడ్డిని అరెస్టు చేసి జైలుకు పంపారు. దీంతో త్వరలో వైసీపీ అధినేత వైఎస్ జగన్ కూడా అరెస్ట్ అవుతారనే ప్రచారం జోరుగా సాగుతోంది. ఈ నేపథ్యంలో, వైసీపీ మాజీ ప్రజాప్రతినిధులు రాజమండ్రిలో కాంగ్రెస్ పార్టీ మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్‌ను కలిశారు.
రాజమహేంద్రవరంలో, వైసీపీ మాజీ ఎమ్మెల్యేలు కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి, అనంత వెంకటరామిరెడ్డి, వైసీపీ నాయకుడు సుగవాసి బాలసుబ్రమణ్యం తదితరులు ఉండవల్లిని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. వీరు ఇటీవల మద్యం కుంభకోణం కేసులో రిమాండ్ లో ఉన్న ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డిని పరామర్శించడానికి నగరానికి వచ్చారు.
ఇబ్బందులతో ఎల్ఐసీ పాలసీ కట్టలేక ఆపేశారా..? డోన్ట్ వర్రీ, మళ్లీ కొనసాగించండిలా..
ఉండవల్లి అరుణ్ కుమార్‌కు రాజకీయ మేధావిగా పేరుంది. ఆయన కొన్నేళ్లుగా రాజకీయాలకు దూరంగా ఉన్నప్పటికీ, రాజకీయాలపై ఆయన వ్యాఖ్యలు చాలా చురుగ్గా ఉంటాయి. ఈ నేపథ్యంలో, రాష్ట్రంలో ప్రస్తుత రాజకీయ పరిస్థితులు, కూటమి ప్రభుత్వాన్ని ఎదుర్కోవడానికి అనుసరించాల్సిన వ్యూహాలపై వైసీపీ నాయకులు ఉండవల్లితో చర్చించి ఉంటారని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. గతంలో కూడా ఉండవల్లి వైసీపీకి అనుకూలంగా పలు వ్యాఖ్యలు చేశారు, జగన్ కు సలహాలు కూడా ఇచ్చారు.
ఆయన వైఎస్ రాజశేఖర్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు కావడంతో, వైసీపీలో చాలా మంది ఆయనకు గౌరవం ఇస్తారు. ప్రస్తుతం కూటమి ప్రభుత్వంపై ఉండవల్లి అసంతృప్తిగా ఉన్నట్లు సమాచారం. అందువల్ల, వైసీపీ మాజీలు ఆయనను కలవడం ప్రాధాన్యత సంతరించుకుంది. అయితే, ఈ భేటీని వారు కేవలం మర్యాదపూర్వక భేటీగానే పేర్కొంటున్నారు.


