ప్రేమికులకు వాలెంటైన్స్ డే ఎంతో ప్రత్యేకమైనది. ఈ రోజు కోసం ఎదురు చూస్తున్న ఎన్నో జంటలు.. తమ ప్రేమను వ్యక్త పరుస్తూ సంబరాలు చేసుకుంటుంటారు. ఇక సింగిల్స్ అయితే తమ లవ్ ప్రయత్నాలను ముమ్మరం చేసుకుంటారు. ప్రేమలో ఉన్న వారు తమ ప్రియమైన వారికి బహుమతులు ఇచ్చి ఈ ప్రేమికుల రోజును ఆనందంగా జరుపుకుంటారన్న విషయం అందరికీ తెలిసిందే. కానీ ఈ వాలెంటైన్స్ డే నాడు ఓ చిత్రమైన ఘటన జరిగింది. అదికూడా ఎక్కడో కాదు మన రాష్ట్రంలోనే. ఈ విషయం గురించి తెలిసిన తర్వాత.. పోలీసులను ఇలా కూడా వాడుకుంటారా అని మీరు షాక్ అవడం గ్యారంటీ.
ఏదైనా ప్రమాదం, అత్యవసర సమయంలో పోలీసుల సహకారం తీసుకుంటారన్న విషయం అందరికీ తెలిసిందే. గొడవలు, అల్లర్లు, ప్రమాదాలు జరిగినప్పుడు పోలీసులు వెంటనే స్పందించి బాధితులకు రక్షణగా నిలుస్తుంటారు. అందుకే అత్యవసర పరిస్థితుల్లో అందరికీ అండగా ఉండేందుకు.. పోలీసులు డయల్ 100ని అందుబాటులోకి తెచ్చింది. ఈ నంబర్ కి ఫోన్ చేసి కంప్లైంట్ చేస్తే వెంటనే పోలీసులు స్పందిస్తారు. అయితే అనంతపురం జిల్లా తాడిపత్రిలో ఒక యువతి తన బాయ్ ఫ్రెండ్ తన ఫోన్ నంబర్ బ్లాక్ చేశాడని డైరెక్ట్‌గా ఫోన్ చేసి చెప్పింది.
తన బాయ్ ఫ్రెండ్ నా నంబర్ బ్లాక్ చేశాడని.. మాట్లాడట్లేదని యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ విషయంలో తనకు సహాయం చేయాలని వాడితో మాట్లాడి అన్ బ్లాక్ చేయించాలని కోరిందంట. గుత్తి ఆర్ఎస్‌కు చెందిన యువతి ఈ విధంగా పోలీసులకు ఫోన్ చేసినట్లు తెలుస్తోంది. కంట్రోల్ రూమ్ వారు స్థానిక పోలీసులకు తెలపడంతో కానిస్టేబుల్ సుధాకర్ ఆమెను సంప్రదించారు. అయితే తన ఇంటికి రావొద్దని, వాడితో మాట్లాడి అన్ బ్లాక్ చేయించాలని కోరడంతో బాయ్ ఫ్రెండ్‌తో మాట్లాడేందుకు యత్నించారు పోలీసులు.
నిజానికి డయల్ 100 అనేది భారతదేశంలో అత్యవసర పరిస్థితుల్లో పోలీసు సహాయం కోసం ఉపయోగించే ఒక టోల్-ఫ్రీ నెంబర్. ఏదైనా ప్రమాదం, నేరం లేదా ఇతర అత్యవసర పరిస్థితుల్లో ఉన్నప్పుడు, ఈ నెంబర్‌కు ఫోన్ చేయడం ద్వారా పోలీసులను సంప్రదించవచ్చు. దీనిని అత్యవసర హాట్‌లైన్‌గా కూడా పిలుస్తారు. కానీ ఇలాంటి పనుల కోసం పోలీసులను వాడుకోవడం ఏంటని నిపుణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. యువతిని అదుపులోకి తీసుకొని కౌన్సిలింగ్ ఇవ్వాలని.. ఈ విషయాన్ని వారి తల్లిదండ్రుల దృష్టికి తీసుకు వెళ్లాలని సోషల్ మీడియాలో కామెంట్లు వస్తున్నాయి.