Andhra Pradesh: డాక్టర్ సూచనతో వాడాల్సిన మాత్రలను ఇప్పుడు మార్కెట్లో విచ్చలవిడిగా అమ్మేస్తున్నారు. వైద్యుడు ఇచ్చే చీటితో సంబంధం లేకుండా బటానీలు మాదిరిగా విక్రయిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌లోని ఉభయ గోదావరి జిల్లాల్లో ఈ దందా నడుస్తోంది. లైంగిక పటుత్వం కోసం.. సుఖవంతమైన సంసారం కోసం ఉపయోగించే వయాగ్రా ట్యాబ్లెట్లను యధేచ్ఛంగా అమ్మేస్తున్నారు. ఒక్క వయాగ్రానే కాకుండా గర్భ విచ్ఛిత్తి మాత్రలను సైతం జోరుగా విక్రయాలు జరుగుతున్నాయి.
ఇటీవలే ఆయా జిల్లాల్లో డ్రగ్ కంట్రోల్ అధికారులు చేసిన తనిఖీల్లో ఈ దారుణం బయటపడింది. నిబంధనలకు విరుద్ధంగా విక్రయిస్తున్న ఈ మెడిసిన్స్ ఎలాంటి బిల్లులు లేకుండా అమ్ముతున్న రాకెట్ గుట్టు రట్టయింది.
ఎలా తెలిసిందంటే?
జంగారెడ్డిగూడెంకు చెందిన డ్రగ్ ఇన్‌స్పెక్టర్ షేక్ అబిద్ అలీ.. స్థానిక మెడికల్ షాపుల్లో రెగ్యులర్ చెకింగ్స్‌కి వెళ్లారు. అయితే ఆ ఏరియాలో మెడికల్ ప్రతినిధిగా పనిచేసే గణేష్ అనే కుర్రాడు అనుమానాస్పదంగా కనిపించడంతో ఆరా తీశారు. రాజమండ్రికి చెందిన గణేష్ కాల్ డేటా పరిశీలించగా.. 30కి పైగా షాపులతో అతడు విక్రయాలు చేసినట్లు తేలింది. అయా మెడికల్ షాపులపై దాడులు చేసి కొన్నింటిని సీజ్ చేశారు.
వయాగ్రా ట్యాబ్లెట్ అనేది షెడ్యూల్డ్ H కేటగిరీకి చెందినది. కౌంటర్లో చెయ్యిపెట్టగానే ఇచ్చేసే మాత్రలు కావివి. రిజిస్టర్డ్ మెడికల్ ప్రాక్టీషనర్ నుంచి ప్రిస్క్రిప్షన్ ఉంటే తప్ప జనాలకు అమ్మకూడదు. కానీ.. గణేష్ అనే వ్యక్తి యధేచ్ఛగా షాపులకు సప్లయ్ చెయ్యడం.. ఆ షాపుల్లో వ్యాపారులు ఈజీగా ఓపెన్ సేల్స్‌లో విచ్చలవిడిగా అమ్మెయ్యడం.. ఇక్కడ జరిగే దందా ఇది. అసలు ఈ షెడ్యూల్డ్ H డ్రగ్ ఇంత సులభంగా వీళ్లకెలా దొరుకుతుందో ఆరా తీస్తే.. ఇదంతా ఓ సిండికేట్ బిజినెస్‌గా తేలింది.
వయాగ్రా కోసం రెగ్యులర్‌గా వాడే వాళ్లలో బీపీ, షుగర్ పేషెంట్లే ఎక్కువ. వివాహేతర సంబంధాలున్న వారితో పాటు శృంగార కోరికలు ఎక్కువగా ఉండి వయసు సహకరించని ముసలి వాళ్లు.. ఎక్‌ట్రా సామర్థ్యం కోసం ఈ వయాగ్రాను మాత్రలను వెర్రిగా కొనుక్కుంటున్నారు. మరోవైపు అవాంఛిత గర్భధారణతో ఆస్పత్రులకు వెళ్లడానికి అవమానంగా భావించే వాళ్లు చాటుమాటుగా గర్భ విచ్ఛిత్తి మాత్రలను ఈ షాపుల వాళ్లు విక్రయిస్తున్నారు.