Polavaram: పోలవరంలో గోదావరి ఉగ్రరూపం దాల్చింది. గోదారమ్మ ఉధృతితో స్థానికంగా ఉండే మహానందీశ్వర ఆలయ మార్గం మునిగిపోయింది. ఎగువన కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ప్రాజెక్ట్ వద్ద గోదావరి మరింత ఉధృతంగా మారింది. స్పిల్ వే కు ఎగువన 27 మీటర్లు నీటి మట్టం దాటింది. దీంతో 48 గేట్ల ద్వారా లక్ష క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. ఇప్పటికే పోలవరం ముంపు గ్రామాలు ముంపునకు గురయ్యాయి.
భారీ వరద ప్రవాహం క్రమంగా పెరుగుతుండటం వల్ల పోలవరం ప్రాజెక్టు వద్ద నీటిమట్టం గణనీయంగా పెరిగింది. ఇప్పటికే ఈ ప్రాజెక్టు స్పిల్‌వే నీటిమట్టం 27.230 మీటర్లకు చేరింది. దీంతో పెరిగిన నీటిమట్టం తగ్గించిన తర్వాత దిగువన 18 మీటర్లుగా నీటిమట్టం నమోదైంది.
భారీగా పెరుగుతున్న వరదను దృష్టిలో ఉంచుకొని నీటిపారుదల శాఖ అధికారులు తక్షణం అప్రమత్తమయ్యారు. ప్రాజెక్టుకు సంబంధించిన 48 గేట్లను ఎత్తేసి.. ప్రాజెక్ట్ స్పిల్‌వే ఛానెల్ ద్వారా 1,13,436 క్యూసెక్కుల నీటిని తిరిగి గోదావరి జలాల్లోకి విడుదల చేసే ప్రక్రియని కొనసాగిస్తున్నారు. ఈ వరద ప్రవాహం కారణంగా స్థానికంగా మహానందీశ్వర స్వామి ఆలయానికి రాకపోకలు ఆగిపోయాయి. గుడికి వెళ్లేందుకు నిర్మించిన రహదారి పూర్తిగా నీట మునిగిపోయింది. దీంతో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.
అదేవిధంగా పోలవరం, గూటాల గ్రామాల మధ్య పేరుకొన్న ఇసుక తిన్నెలు కూడా కొద్దికొద్దిగా వరదలో మునిగిపోతున్నాయి. ఇటు గోదావరి నదిలో వరద ప్రవాహం క్రమంగా పెరుగుతుండండ వల్ల కొనసాగుతుండటంతో అధికారులు పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. ముందస్తు అవసరమైన చర్యలు తీసుకుంటున్నారు.