కర్నూలు, (తెలుగు ప్రభ): ఆన్‌లైన్ సైబర్ మోసాలు రోజురోజుకూ పెరుగుతున్న తరుణంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కర్నూలు జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ సూచించారు. నకిలీ ఐపీఓలు, షేర్ మార్కెట్ పెట్టుబడుల పేరుతో అధిక లాభాలు వస్తాయంటూ సైబర్ నేరగాళ్లు ప్రజలను మోసం చేస్తున్నారని ఆదివారం విడుదల చేసిన ప్రకటనలో తెలిపారు.
ప్రముఖ కంపెనీల ఐపీఓల్లో భారీగా షేర్లు కేటాయిస్తామంటూ సైబర్ నేరగాళ్లు సోషల్ మీడియా, ఫోన్ కాల్స్, వాట్సాప్ గ్రూపుల ద్వారా ప్రజలను సంప్రదిస్తున్నారని ఎస్పీ తెలిపారు. తక్కువ సమయంలో భారీ లాభాలు వస్తాయని నమ్మించి బాధితులను తమ వలలోకి లాగుతున్నారని పేర్కొన్నారు.
ముందుగానే డబ్బులు జమ చేయించి మోసం
వందలు, వేల సంఖ్యలో షేర్లు అలాట్ అయ్యాయని, వాటి విలువ త్వరలో భారీగా పెరుగుతుందని నమ్మిస్తూ బాధితుల నుంచి ముందుగానే పెద్ద మొత్తంలో నగదును గుర్తుతెలియని బ్యాంకు ఖాతాల్లో జమ చేయించుకుంటున్నారని తెలిపారు. డబ్బులు బదిలీ చేసిన తర్వాత షేర్లు కేటాయించకుండా సైబర్ నేరగాళ్లు ఫోన్‌లు స్విచ్ఛాఫ్ చేయడం లేదా అందుబాటులో లేకుండా పోతున్నారని వివరించారు.
పెట్టుబడుల విషయంలో అప్రమత్తత తప్పనిసరి
షేర్ మార్కెట్‌లో పెట్టుబడులు పెట్టేటప్పుడు సెబీ గుర్తింపు పొందిన అధీకృత బ్రోకర్లు, అధికారిక బ్యాంకింగ్ మార్గాలను మాత్రమే వినియోగించాలని ఎస్పీ సూచించారు. గుర్తుతెలియని వ్యక్తులు పంపే లింకులు, వాట్సాప్, సోషల్ మీడియా గ్రూపుల ద్వారా పెట్టుబడులు పెట్టకూడదన్నారు.
తక్కువ సమయంలో భారీ లాభాలు వస్తాయంటూ వచ్చే ఫోన్ కాల్స్, సందేశాలను నమ్మవద్దని, అనుమానాస్పద లింకులపై క్లిక్ చేయకూడదని సూచించారు. తెలియని యాప్‌లను మొబైల్ ఫోన్లలో ఇన్‌స్టాల్ చేయవద్దని హెచ్చరించారు. పెట్టుబడుల పేరుతో ఎవరైనా అత్యవసరంగా డబ్బులు బదిలీ చేయాలని కోరితే, ముందుగా వారి వివరాలను అధికారిక మార్గాల్లో ధ్రువీకరించుకోవాలని తెలిపారు.
మోసపోతే వెంటనే 1930కు ఫోన్
సైబర్ మోసానికి గురైన వారు ఏమాత్రం ఆలస్యం చేయకుండా 1930 సైబర్ క్రైమ్ హెల్ప్‌లైన్‌కు ఫోన్ చేయాలని ఎస్పీ సూచించారు. అలాగే cybercrime.gov.in ద్వారా కూడా ఫిర్యాదు చేయవచ్చని తెలిపారు. మోసం జరిగిన వెంటనే ఫిర్యాదు చేస్తే నగదు లావాదేవీలను త్వరగా గుర్తించి, డబ్బును నిలిపివేయడం లేదా తిరిగి పొందే అవకాశాలు మెరుగుపడతాయని ఎస్పీ విక్రాంత్ పాటిల్ పేర్కొన్నారు.

