ప్రాణాలు కాపాడే రక్షణ కవచం హెల్మెట్ అని, వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ వినియోగించి ప్రాణాలు రక్షించుకోవాలని ఆత్మకూరు డిఎస్పీ రామాంజి నాయక్ సూచించారు. ఆత్మకూరు డివిజన్ పోలీసుల ఆధ్వర్యంలో శుక్రవారం ఆత్మకూరు పట్టణంలో హెల్మెట్ ధరించడంపై అవగాహన ర్యాలీ నిర్వహించారు.
ఈకార్యక్రమానికి ముఖ్య అతిథిగా డిఎస్పీ హాజరై హెల్మెట్ ధరించి అవగాహన ర్యాలీలో పాల్గొన్నారు. ఆత్మకూరు యుపిఎస్ పోలీసు స్టేషన్ నుంచి ప్రారంభమైన ర్యాలీ గౌడ్ సెంటర్, కొత్త బస్టాండ్, ఇందిరా నగర్ చర్చ్, చక్రం హోటల్ వరకు నిర్వహించారు. జాతీయ, రాష్ట్ర రోడ్డు ప్రమాదాల్లో ఎక్కువ శాతం ద్విచక్ర వాహనదారులే మరణిస్తున్నారని, హెల్మెట్ లేకపోవడం వల్లే మరణాలు చోటు చేసుకుంటున్నాయని డిఎస్పీ అన్నారు. వాహనదారులు హెల్మెట్ ధరించి వాహనాలు నడపటంతో రోడ్డు ప్రమాదాలు జరిగినప్పుడు ప్రాణాపాయం నుంచి బయటపడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయన్నారు.
యువత అత్యుత్సాహంతో అతి వేగంగా వాహనాలను డ్రైవింగ్ చేసి రోడ్డు ప్రమాదాల బారిన పడకూడదన్నారు. తల్లిదండ్రులు తమ పిల్లలకు ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన కల్పించాలని సూచించారు. మద్యం సేవించి, సెల్ ఫోన్లో మాట్లాడుతూ వాహనాలు నడపడం చట్టవిరుద్ధం అన్నారు. ఈ కార్యక్రమంలో ఆత్మకూరు రూరల్ సీఐ సురేష్ కుమార్ రెడ్డి, టౌన్ సీఐ రాము, డివిజన్ పరిధిలోని అన్ని స్టేషన్ ల ఎస్సైలు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.