వైసిపి నాయకులు కార్యకర్తలపై దాడులు చేస్తే భయపడేది లేదని, రాబోయే కాలంలో తిరిగి వడ్డీతో సహా చెల్లిస్తామని బనగానపల్లె మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి స్పష్టం చేశారు. విద్యుత్ బాదుడుపై వైసిపి పోరుబాట కార్యక్రమంలో భాగంగా విద్యుత్ సబ్ స్టేషన్ వరకు ర్యాలీ నిర్వహించి ఏడిఈకి వినతి పత్రం సమర్పించిన అనంతరం కాటసాని రామిరెడ్డి ప్రసంగించారు.
మేం కూడా రెడ్ బుక్
రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తోందని, తమ కార్యకర్తలను ఇబ్బంది పెడుతున్నారని, అలాంటి వారిపై తాము కూడా రెడ్ బుక్ మైంటైన్ చేస్తున్నామని అన్నారు. తమ ఐదేళ్ల ప్రభుత్వ పాలనలో ప్రజలకు మేలు చేయడం, మంచిపేరు తెచ్చుకోవడం పైనే దృష్టి సారించామని అన్నారు. కానీ కూటమి ప్రభుత్వం వచ్చాక రెడ్ బుక్ పేరుతో తమ నాయకులను కార్యకర్తలపై అక్రమ కేసులు బనాయిస్తూ ఇబ్బందులు పెడుతున్నారని అన్నారు. అయితే ఆ నాయకులు గుర్తుపెట్టుకోవాలని రాబోయేది మళ్లీ జగనన్న ప్రభుత్వమేనని, ఏ గ్రామంలో ఏ నాయకున్ని, ఏ కార్యకర్తని ఎలా ఇబ్బంది పెట్టారో అప్పుడు వడ్డీతో సహా తిరిగి చెల్లిస్తామని హెచ్చరించారు. కూటమి నాయకులు చేస్తున్న ఈ చర్యలు తమను కూడా ఇలాంటి రాజకీయాలు చేయాలని నేర్పినట్లుగా ఉందని అన్నారు. తమ నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి కక్షపూరిత రాజకీయాలకు దూరంగా ఉంచి అభివృద్ధి సంక్షేమం పైనే దృష్టి సారించడం వారికి లోకువగా మారిందని, ఇకపై ఎలా ఉండబోదని స్పష్టం చేశారు. వైసీపీ నాయకులు, కార్యకర్తలపై ఎలాంటి కేసులు పెట్టినా, జైల్లో పెట్టినా భయపడాల్సిన అవసరం లేదని, ఇకపై మాటలతో కాదని చేతల్లో చూపుతామని అన్నారు.