శ్రీశైలం నియోజకవర్గ ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర రెడ్డి కృషి ఫలించింది, దశాబ్దాలుగా సున్నిపెంట అభివృద్ధికి ఆటంకంగా నిలిచిన సమస్యలు ఒక్కొక్కటిగా తొలగిపోతున్నాయి. సున్నిపెంట గ్రామ అభివృద్ధికి ప్రణాళికలు సిద్ధం చెయ్యాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాలు జారీ చెయ్యడంతో సున్నిపెంట వాసుల సమస్యలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
గత రెండు రోజులుగా మంగళగిరిలో జరుగుతున్న రెండవ జిల్లా కలెక్టర్ల సమీక్షా సమావేశంలో రాష్ట్ర రెవెన్యూ శాఖా మంత్రి పయ్యావుల కేశవ్, దేవాదాయశాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, జిల్లా కలెక్టర్ రాజకుమారి గణీయా లు సున్నిపెంట గ్రామ సమస్యలను సిఎంకు వివరించారు. జలవనరుల శాఖకు సంబంధించిన 300 ఎకరాల భూమిని దేవాదాయ శాఖకు బదలాయింపు చెయ్యాలని ఇటీవల కోరగా అందుకు తమరు అంగీకరించారని కానీ ఆ ఫైల్ ఇంకా పెండింగ్ లో ఉందని అది జరిగితే దేవాదాయ శాఖ ద్వారా సున్నిపెంట టౌన్ షిప్ అభివృద్ధికి దోహదపడుతుందని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తెలుపగా.. రోజుల వ్యవధిలోనే ఆ ఫైల్ ను పరిష్కరించాలని సిఎం చంద్రబాబు సీ.ఎస్ ను ఆదేశించారు.
ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చైర్మన్ గా మంత్రులు ఆనం రామనారాయణ రెడ్డి, బీసీ జనార్ధన్ రెడ్డి, కలెక్టర్, ఫారెస్ట్, ఇరిగేషన్ అధికారులతో వేసిన కమిటీ ఇప్పటికే సమావేశమై సున్నిపెంట అభివృద్ధికి తీసుకోవలసిన చర్యలపై చర్చించినట్లు మంత్రులు తెలిపారు. సున్నిపెంట ప్రాజెక్టు కాలనీని గ్రామ పంచాయతీగా మార్చినప్పటికినీ.. శ్రీశైలం మండలం అనేదే నంద్యాల జిల్లాలో నమోదు కాలేదని కావున ఎన్నికలు జరగక 15వ ఆర్థిక సంఘం నిధులు మంజూరు కాలేదని, ఇది కేవలం టౌన్ షిప్ కావడం ఎలాంటి ప్రభుత్వ స్థలం లేక పోవడంతో ఎన్.ఆర్.ఈ.జి.ఎస్ పనులు కూడా చేపట్టలేకపోతున్నామని, ఉన్నదంతా అటవీ, జలవనరుల శాఖ స్థలమేనని కలెక్టర్ రాజకుమారి గణియా సిఎం చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లారు.. అందువల్ల త్రాగునీరు సరఫరా, మౌలిక వసతుల కల్పనకు ఇబ్బందిగా ఉందని తెలిపారు.
తిరుమల-తిరుపతి తరహాలోనే
స్పందించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సున్నిపెంట గ్రామ పంచాయతీకి ఆటంకం కలగకుండా శ్రీశైలం దేవస్థానం ద్వారానే అభివృద్ధి చేద్దామని, రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎన్నికలు నిర్వహించి నిధుల విడుదలకు కృషి చేయాలన్నారు. తిరుమల తిరుపతి తరహా మాదిరిగానే శ్రీశైలం సున్నిపెంటను టౌన్ షిప్ గా అభివృద్ధి చేద్దామని అన్నారు. సున్నిపెంటను టెంపుల్ టూరిజంగా అభివృద్ధి చేసేందుకు అత్యంత అనుకూలమైన ప్రాంతం అని ఇక్కడ ఫైవ్ స్టార్ హోటల్స్ తో పాటు సామాన్య భక్తులకు అందుబాటులో వివిధ రకాల హోటల్స్ లను ఏర్పాటు చేసేందుకు అనేక స్టార్ హోటల్స్ సిద్ధంగా ఉన్నాయని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. అటవీ శాఖ ఆధ్వర్యంలో టైగర్ సఫారీ తోపాటు భక్తులను, పర్యాటకులను ఆకర్షించేందుకు పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేయాలని సిఎం చంద్రబాబు సూచించారు. సున్నిపెంట అభివృద్ధిపై సిఎం చంద్రబాబు నాయుడు సమీక్షించడంపై స్థానిక శ్రీశైలం టిడిపి శ్రేణులు హర్షం వ్యక్తం చేశారు.
టెంపుల్ టూరిజం
అకుంటిత దీక్షతో ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర రెడ్డి శ్రీశైలం నియోజకవర్గాన్ని టెంపుల్ టూరిజం ద్వారా అభివృద్ధి చేసేందుకు అనేక ప్రణాళికలు సిద్ధం చేసి మంత్రులకు, సిఎం దృష్టికి తరుచూ తీసుకువెళ్లడం వల్లే సున్నిపెంట అభివృద్ధికి బాటలు పడ్డాయని వారు పేర్కొన్నారు. టెంపుల్ టూరిజం ద్వారా నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసి స్థానిక యువతి యువకులకు ప్రత్యేకంగా, పరోక్షంగా ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించవచ్చనేది ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర రెడ్డి తపన అని వారు అన్నారు.