కర్ణాటకలో జరిగిన రోడ్డు ప్రమాదంపై ఏపీ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పదించారు. మంత్రాలయం వేద పాఠశాల విద్యార్థులు మృతిచెందడం.. తీవ్ర ఆవేదన, దిగ్భ్రాంతిని కలిగించిందన్నారు. క్షతగాత్రులకు తక్షణ వైద్యం అందించాలని ఆదేశించామన్నారు. మృతుల కుటుంబాలను ఆదుకుంటామన్నారు.
వేకువ జామునే ప్రమాదం
కర్ణాటకలో బుధవారం వేకువజామున ఘోర రోడ్డు ప్రమాదం లో కర్నూలు జిల్లా మంత్రాలయం వేద పాఠశాలకు చెందిన ముగ్గురు విద్యార్థులతో పాటు డ్రైవర్ మృతి చెందారు. ఈ ప్రమాదంలో మరికొందరు విద్యార్థులకు గాయాలయ్యాయి. క్షతగాత్రులను సింధనూరు ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.మంత్రాలయం నుంచి వేద పాఠశాల విద్యార్థులు కర్నాటకలోని హంపి క్షేత్రంలో జరిగే ఆరాధన కార్యక్రమానికి వెళుతుండగా సింధనూరు సమీపంలో వాహనం బోల్తా పడింది.
మృతుల వివరాలు:
మృతులు మంత్రాలయం, ధారవాడ, గంగావతికి చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. ఈ ఘటనపై మంత్రాలయం పీఠాధిపతి శ్రీ సుభుధేంద్ర తీర్థ స్వామి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు..మృతుల కుటుంబాలకు అండగా ఉంటామన్నారు. ఈ ఘటనలో చనిపోయినవారి మృతదేహలకు పంచనామా తర్వాత వారి స్వగ్రామాలకు తరలించనున్నారు. ప్రమాదం జరిగిన స్థలాన్ని పరిశీలించిన పోలీసులు.. ఈ ప్రమాదంపై కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.