మంగళవారం సాయంత్రం యాగంటి దేవస్థానంలో జరిగిన బ్రహ్మోత్సవాల సమీక్ష సమావేశంలో పాల్గొనేందుకు విచ్చేసిన రాష్ట్ర ఆర్ అండ్ బి శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి యాగంటి ఉమామహేశ్వరస్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
యాగంటి బ్రహ్మోత్సవాలను విజయవంతం చేయండి
యాగంటి శ్రీ ఉమా మహేశ్వర స్వామి దేవస్థానంలో జరిగే మహా శివరాత్రి బ్రహ్మోత్సవాలను అధికారులు అందరూ సమన్వయంతో పనిచేసి విజయవంతం చేయాలని మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి అన్నారు. బ్రహ్మోత్సవాల నిర్వహణ విషయంలో ప్రతి ఒక్కరూ చిత్తశుద్ధితో భక్తులకు ఎలాంటి అసౌకర్యం రాకుండా చూడాలని అన్నారు. ప్రధానంగా క్యూలైన్ ఏర్పాట్లు, పారిశుద్యం, వైద్యం, ఆరోగ్యం విషయంలో ప్రత్యేక శ్రద్ధ వహించాలని ఆయన ఆయా శాఖల అధికారులను ఆదేశించారు. భక్తులకు ఆరోగ్యపరమైన సేవలు అందించే విషయంలో లోటుపాట్లు రాకుండా చూడాలని తాను హఠాత్తుగా వచ్చి తనిఖీ చేసి ఏర్పాట్లు పరిశీలిస్తానని హెచ్చరించారు.

టోల్ గేట్ వసూలు చేయద్దు
బ్రహ్మోత్సవాల్లో వరుసగా 25, 26, 27 తేదీల్లో మూడు రోజులు వాహనదారుల నుంచి టోల్ గేట్ వసూలు చేయవద్దని ఆయన ఆదేశించారు. భక్తులకు విక్రయిస్తున్న లడ్డూలు నాణ్యత లోపించిందని ఆరోపణలు వచ్చాయని పేర్కొంటూ బ్రహ్మోత్సవాల సమయంలో తానే సొంత ఖర్చుతో ఐదు రోజులపాటు ఉచిత లడ్డూలను అందజేస్తామని అన్నారు. ఆలయంలో భక్తుల వేసవి కారణంగా ఇబ్బంది పడకుండా సొంత ఖర్చుతో ఏసీ సౌకర్యం కల్పిస్తానని మంత్రి హామీ ఇచ్చారు. యాగంటి ఆయకట్టు గ్రామాల ప్రజలు, టీడీపీ నాయకులు, కార్యకర్తలు ఉత్సవాల రోజుల్లో ప్రత్యేక దర్శనం పేరిట దూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులకు ఇబ్బంది పెట్టవద్దని ప్రతి ఒక్కరు క్యూలైన్ ద్వారానే స్వామివారిని దర్శించుకోవాలని కోరారు.

ఈ సమీక్షా సమావేశంలో యాగంటి పల్లె ఉప సర్పంచ్ బండి మౌళీశ్వర రెడ్డి, ఆలయ డిఈవో, ఆలయ ఈవో బి చంద్రుడు, ఆలయ ప్రత్యేక అధికారి హరిచంద్రా రెడ్డి ఎంపీడీవో బీవీ రమణ, ఈ ఓ ఆర్ డి బొమ్మిరెడ్డి సతీష్ కుమార్ రెడ్డి, తహసిల్దార్ నారాయణరెడ్డి , ఆర్డబ్ల్యూఎస్ ఏఈ సాయికృష్ణ, డిఆర్డిఏ ఏపీఎం శ్రీనివాస్, విద్యుత్ శాఖ శ్రీనివాసులు, వైద్య , ఆరోగ్య ఆర్టీసీ, పోలీస్ డిపార్ట్మెంట్ శాఖలకు చెందిన అధికారులు పాల్గొన్నారు.