HomeAP జిల్లా వార్తలుPraja Darbar: మా భూముల్లో సోలార్ విద్యుత్‌ ప్లాంటుతో మా కడుపులు కొట్టొద్దు

Praja Darbar: మా భూముల్లో సోలార్ విద్యుత్‌ ప్లాంటుతో మా కడుపులు కొట్టొద్దు

శంఖవరం (తెలుగుప్రభ): ఏళ్ల తరబడి సాగు చేసుకుంటూ జీవనం కొనసాగిస్తున్న మా పంట భూములను మాకే ఉండనివ్వండి.. మా భూముల్లో వ్యవసాయ రైతులకు ఉపయోగపడే సోలార్ విద్యుత్తు ప్లాంటును ఏర్పాటు చేయొద్దు. మా మొర కాదని, సోలార్ విద్యుత్ ప్లాంటును ఏర్పాటు చేసి మా కడుపులు కొట్టొద్దంటూ కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం ప్రత్తిపాడు మండలం లంపకలోవ గ్రామానికి చెందిన ఎస్సీ రైతులు అందరూ పెదశంకర్లపూడిలోని తెలుగు దేశం పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభను శుక్రవారం కలసి ప్రజాదర్బార్ కార్యక్రమంలో వేడుకున్నారు. 

- Advertisement -

సోలార్ విద్యుత్తు ప్లాంటును ఏర్పాటుతో మా భూములతో పాటు మా జీవనాధారాన్ని కూడా కోల్పోతామని ఎమ్మెల్యేకు వివరించారు. లంపకలోవ గ్రామానికి చెందిన ఎస్సీ రైతులమైన మా కొందరకు ఉత్తరకంచి గ్రామ రెవెన్యూ పరిధిలోని ఎల్.పి.ఎం. నంబర్ 4/3 ఎ లోని 18.746 ఎకరాల భూమిని ఏళ్ల తరబడి సాగు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాం. ఈ 18.746 ఎకరాల భూమిలోని 10 ఎకరాల్లో పీఎం – కుసుమ్ కాంపోనెంట్-సీ (ఫీడర్ లెవల్ సోలరైజేషన్) పథకంలో సోలార్ విద్యుత్తు ప్లాంట్ ఏర్పాటుకు జిల్లా కలెక్టర్ ఉత్తర్వులను ఇచ్చారని తెలిసింది.‌ 

వ్యవసాయ ఫీడర్‌ను సోలార్ ద్వారా నడపుతూ పగటిపూట రైతులకు పొలాల బోరు బావులకు ఉచితంగా, నాణ్యమైన విద్యుత్తును సరఫరా చేయాలని, దీని వల్ల ప్రభుత్వానికి విద్యుత్తు కొనుగోలు భారాన్ని తగ్గించు కోవాలని చూస్తోంది. దీనికోసం ప్రభుత్వం కనీసం 10 ఎకరాల బీడు భూమిని సేకరించి అక్కడ సోలార్ విద్యుత్తు ప్లాంటును ఏర్పాటు చేస్తోంది. ఇదంతా బాగానే ఉంది. అయితే ఆ సేకరించే భూమి మాత్రం గత కొన్నేళ్ళుగా మా సాగు, స్వాధీనంలో ఉండి… మాకు ప్రధాన జీవనాధారంగా ఉన్న భూమి కావడం మా పొట్ట కొట్టే పథకంగా ఉండటం మాకు తీవ్ర మనస్థాపాన్ని, ఆర్ధిక నష్టాన్ని కలిగిస్తుంది. 

‘మా భూముల్లో సోలార్ విద్యుత్తు ప్లాంటును ఏర్పాటు చేయొద్దు. ఆ ఆలోచనను ప్రభుత్వం విరమించు కోవాలి.‌ దానికి ప్రత్యామ్నాయంగా వేరే బంజరు భూమిని ప్రభుత్వం సేకరించకుంటే మంచిద’ని ఆ బాధిత ఎస్సీ రైతులు అందరూ ఎమ్మెల్యేకు విన్నవించారు. మా జీవనాధార సాగు భూముల్లో సోలార్ విద్యుత్తు ప్లాంట్ కేటాయింపును రద్దు చేసి తమకు న్యాయం చేయాలని కోరారు. ఈ మేరకు లంపకలోవ నాయకులు గొంతిన సురేష్, చక్కపల్లి నవీన్ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభకు వినతి పత్రాన్ని అందజేశారు. 

ఈ కార్యక్రమంలో బీరా దేవతయ్య, బోడపాటి ఏసుబాబు, తొర్ల విజేంద్ర, బొడ్డు అచ్చారావు, కింతాడ యతిమాని, చిన్నం నానీబాబు, సుంకర రాజులమ్మ, గుమ్మాల వీరలక్ష్మి, పులకపురి మరియమ్మతో పాటు సుమారు 40 మంది రైతులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News