మంత్రాలయం,(తెలుగు ప్రభ): ప్రసిద్ధ ఆధ్యాత్మిక క్షేత్రం అయిన మంత్రాలయం రాఘవేంద్ర స్వామి మఠంలో మృత్తికా బృందావనానికి అర్చకులు పాదపూజ నిర్వహించారు. యజ్ఞమంటపంలో అర్చకులు సుదీంద్ర ఆచార్ మృత్తికా బృందావనాన్ని వెండిమంటపంలో ఉంచి పాదపూజ నిర్వహించారు. రాఘవేంద్రస్వామి పాదాలకు పుష్పాభిషేకం, కనకాభిషేకం నిర్వహించి మంగళహారతులు ఇచ్చారు. అధిక సంఖ్యలో భక్తులు పాదపూజ కార్యక్రమంలో పాల్గొని మొక్కలు తీర్చుకున్నారు. అర్చకులు సుదీంద్ర ఆచార్ పాదపూజ అనంతరం భక్తులకు ఫలమంత్ర అక్షింతలు ఇచ్చి ఆశీర్వదించారు. అనంతరం మృత్తికా బృందావనాన్ని బంగారు పల్లకిలో ఉంచి శ్రీమఠం ప్రాంగణంలో వైభవంగా ఊరేగించారు.

ఈ కార్యక్రమంలో అర్చకులు, సిబ్బంది పాల్గొన్నారు. శ్రీమఠంలో భక్తుల సందడి ఆదివారం సెలవు రోజు కావడంతో రాఘవేంద్ర స్వామి మూల బృందావనాన్ని దర్శించుకోవడానికి దేశం నలమూలాల నుంచి అధిక సంఖ్యలో భక్తులు మంత్రాలయం వచ్చారు. దీంతో శుక్రవారం సాయంత్రం నుంచి శని, ఆదివారాలు భక్తులతో సందడిగా మారింది.

