నల్లమల అరణ్యంలోని చెంచుల అభివృద్ధికి నిధుల కొరత లేదని, ప్రధానమంత్రి నరేంద్రమోడీ ఆలోచనతో కేంద్ర ప్రభుత్వం చెంచుల సంక్షేమం కోసం ప్రత్యేక కోట్టా పథకం ఏర్పాటు చేశారని, నిధులు వెంటనే మంజూరు చేస్తుందని నంద్యాల పార్లమెంట్ సభ్యురాలు, లోక్‌సభ టీడీపీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ డాక్టర్ బైరెడ్డి శబరి తెలిపారు.
శ్రీశైలం పాదయాత్రగా వెళ్తూ నల్లమల అరణ్యంలోని చెంచుల రాజధాని పెచ్చేరువు చెంచుగూడెంలో ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి చెంచు మహిళలు, గూడెం పెద్దలతో వారి సమస్యలు తెలుసుకునేందుకు ప్రత్యేక సమావేశం నిర్వహించారు. అటవీ అధికారుల వేధింపులు తొలగించాలని, ఇప్పటికే ప్రభుత్వం మంజూరు చేసిన పక్కా గృహాల నిర్మాణం పనులు చేయకుండా అటవీ అధికారులు అడ్డుపడుతున్నారని తదితర సమస్యలను వినతి పత్రం ద్వారా ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి కి చెంచు మహిళలు విన్నవించారు.

ఈ సందర్భంగా ఎంపీ బైరెడ్డి శబరి మాట్లాడుతూ 20 రోజుల క్రితమే నంద్యాల పార్లమెంట్ పరిధిలోని చెంచులకు 600 పైగా ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం ద్వారా పక్కా గృహాలు మంజూరు చేయడం జరిగిందని వివరించారు. సిద్ధేశ్వరం, బలపాలతిప్ప, జానాల చెంచు గూడెంలకు కేంద్ర ప్రభుత్వం ద్వారా రూ. 4.40 కోట్ల తో తారు రోడ్డు మంజూరు చేసినట్లు తెలిపారు. రూ. 1.50 కోట్ల నిధులతో ఈ గూడెంలలో విద్యుత్ సరఫరాకు నిధులు మంజూరు చేయించి కరెంటు పనులు పూర్తి చేశామన్నారు.
చెంచు చిన్నారులను బడులకు పంపించేందుకు, వారిలో అవగాహన కల్పించేందుకు తాను గూడెంలలో పర్యటన చేశానని ఆమె అన్నారు. గిరిజన పాఠశాలల్లోని సమస్యలు కూడా పరిష్కరిస్తామన్నారు. నంద్యాల జిల్లాలోని 46 చెంచు గూడెంలు అభయారణ్యం (కోర్ ఏరియా) నిషేదిత పరిధిలో ఉన్నాయని, పులుల సంరక్షణతో పాటు చెంచుల అభివృద్ధి కూడా ముఖ్యమని, అటవీ చట్టాలకు లోబడి వారి అనుమతితో చెంచుల బాగుకోసం కృషి చేస్తామని తెలిపారు.
ఇక కొందరు అటవీ అధికారులు చెంచులను ఇబ్బంది పెడుతున్నారని తనకు ఫిర్యాదు అందాయని, వాటిని నంద్యాల జిల్లా కలెక్టర్ రాజకుమారి దృష్టికి తీసుకెళ్లి పరిష్కారం చూపామని ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి వివరించారు. శ్రీశైలంలోని ఐటీడీఏను ప్రక్షాళన చేసి, అక్కడ గిరిజనేతర ఉద్యోగులను తొలగించి గిరిజనులకు మాత్రమే ఐటీడీఏలో విధులు నిర్వహించేలా చూడాలని ఎంపీ శబరిని చెంచు గూడెంల పెద్దలు కోరగా రోరారు. దీనిని ఏపీ సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకు వెళ్తానని ఎంపీ హామీ ఇచ్చారు. చెంచులకు వైసీపీ పాలనకన్నా మెరుగైన సేవలు అందిస్తామని భరోసా ఇచ్చారు.