నంద్యాల జిల్లా బనగానపల్లె మండలం ఎర్రమల కొండల్లో వెలసిన మహిమాన్విత శైవ క్షేత్రం.. యాగంటి శ్రీ ఉమామహేశ్వర స్వామి సన్నిధిలో మంగళవారం మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. ఆలయ ఈవో బి. చంద్రుడు ఆధ్వర్యంలో ఈ ఉత్సవాలు జరుగుతున్నాయి. ఈ సందర్భంగా గర్భాలయంలో శ్రీ ఉమామహేశ్వరస్వామి విగ్రహాలకు, ఎదురుగా ఉన్న అలంకార మండపంలోని స్వామివారి ఉత్సవమూర్తులకు ప్రత్యేక పూజలతోపాటు గణపతి పూజ, పుణ్యాహవచనం, త్రిశూల చండీశ్వరార్చన, దీక్ష కంకణధారణలను భక్తి శ్రద్ధలతో చేపట్టారు.

అనంతరం ఆలయ ప్రాంగణంలోని ధ్వజస్తంభం వద్ద ఉత్సవ మూర్తులను కొలువుదీర్చి ఆలయ ప్రధాన అర్చకులు మహేష్ శర్మ, ముఖ్య అర్చకుడు సత్యనారాయణ శర్మ, సహాయ అర్చకులు లోక్ నాథశర్మ, దేవేంద్ర శర్మ, రాఘవేంద్రశర్మ, వేద పండితులు కిషోర్ శర్మలు శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించారు.
అనంతరం బ్రహ్మోత్సవాలకు సకల దేవతలను ఆహ్వానించేందుకు వీలుగా ధ్వజారోహణ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో ఆలయ పాలకమండలి సభ్యులు, సిబ్బంది ప్రసాద్, రమేష్ బాబు, యాగంటి పల్లె ఉపసర్పంచ్ బండి మౌళీశ్వర్ రెడ్డి పాల్గొన్నారు.