ఆంధ్రప్రదేశ్ శాసనసభ సమావేశాల ముగింపు సందర్భంగా, ఈనెల 21 వ తేదీన శాసనసభ్యులు, మరియు మండలి సభ్యుల ఉల్లాసానికి, ఆట పాటలకు విజయవాడ బరంపార్క్ (Baram Park) వేదిక కానుంది. శాసనసభ సభాపతి అయ్యన్నపాత్రుడు ఆదేశాల మేరకు, క్రీడా పోటీలు మరియు సాంస్కృతిక కార్యక్రమాలు జరగనున్నాయి. ఈ విశేష కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హాజరయ్యే అవకాశం ఉంది.

ఈ సందర్భాన్ని పురస్కరించుకుని, ఏపీ టూరిజం డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (ఏపీటీడీసీ) చైర్మన్ డాక్టర్ నూకసాని బాలాజీ ఇంజినీరింగ్ అధికారులతో కలిసి బరంపార్క్ పరిసరాల అభివృద్ధిపై సమీక్షించారు. గత ప్రభుత్వ నిర్లక్ష్యంతో నిర్లిప్తమైన ఈ ప్రాంతాన్ని కొత్త సొబగులతో తీర్చిదిద్దేందుకు, పారిశుద్ధ్య పనులు, వ్యర్థాల తొలగింపు, సుందరీకరణ పనులను వేగవంతం చేయాలని నిర్ణయించారు.

ఈ ప్రతిష్టాత్మక కార్యక్రమం విజయవాడ నగర పర్యాటక రంగానికి కొత్త ఊపునిస్తుంది. ముఖ్యంగా బెరం పార్కులో భవిష్యత్తులో మరిన్ని అభివృద్ధి ప్రణాళికలు అమలు చేసేందుకు ప్రధాన అడ్డంకిగా ఉన్న హైటెన్షన్ టవర్‌ను మరో ప్రదేశానికి తరలించేందుకు విద్యుత్ శాఖ మంత్రితో ఫోన్లో మాట్లాడారు. త్వరలో విద్యుత్ శాఖ అధికారులు, ఏపీటీడీసీ ఇంజినీరింగ్ విభాగం, చీఫ్ ఇంజినీర్ సంయుక్తంగా ఈ మార్పుపై అధ్యయనం చేయనున్నారు.

ఈ సమీక్ష సమావేశంలో ఏపీటీడీసీ చైర్మన్‌తో పాటు టూరిజం ఇంజినీరింగ్ విభాగం అధికారులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమం బరంపార్క్ అభివృద్ధికి మాత్రమే కాకుండా, ఆంధ్రప్రదేశ్ టూరిజం ప్రమోషన్‌కు సువర్ణావకాశంగా మారనుంది.