విజయవాడలో త్వరలో ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్(NTR Trust Bhavan) ఏర్పాటు కానుంది. ఇందుకు సంబంధించిన పనులకు త్వరలోనే శ్రీకారం చుట్టనున్నారు. ఈ నెల 6న ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ నారా భుశనేశ్వరి భవన నిర్మాణానికి శంకుస్థాపన చేస్తారు.
భవనం కోసం ఇటీవల 16వ జాతీయ రహదారిపై నున్న ఎల్ఈపీఎల్ మాల్ పక్కన, సాయిబాబా ఆలయ రోడ్డు జంక్షన్‌లో 600 గజాల స్థలాన్ని కొనుగోలు చేశారు. ఇందులో జీ ప్లస్ 5 విధానంలో అత్యంత అధునాతనంగా భవనాన్ని నిర్మించనున్నారు.
ప్రస్తుతం హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ నుంచి కార్యకలాపాలు కొనసాగుతున్నాయి. విజయవాడ భవనం పూర్తయితే ఇక్కడి నుంచే కార్యకలాపాలు నిర్వహిస్తారు.
ఇందుకోసం హైదరాబాద్ ట్రస్ట్ భవన్‌లో పనిచేస్తున్న కొందరు ఉద్యోగులను విజయవాడ కార్యాలయానికి బదిలీ చేస్తారు. అవసరాన్ని బట్టి స్థానికంగానూ కొందరిని నియమించుకుంటారు.