విజయవాడలో ట్రాఫిక్ పోలీసులు విధి నిర్వహణలో ఓ బండిని చూసి నోరెళ్లబెట్టారు. దానికున్న నెంబరు ప్లేటును చూసి మరింత విస్మయానికి గురయ్యారు. ఆ బండి నెంబరు ప్లేటుపై నెంబరుకు బదులుగా మాఫియా అని రాసి ఉండటంతో బెజవాడ ట్రాఫిక్ పోలీసులు కంగుతిన్నారు.
బెజవాడలోని ఓ సర్కిల్ వద్ద ట్రిపుల్ రైడింగ్ ను గమనించిన ట్రాఫిక్ పోలీసులు ఆ ద్విచక్రవాహనాన్ని ఆపారు. నెంబరు కోసం చూడగా, మాఫియా అని రాసి ఉన్న ఇంగ్లీషు లెటర్స్ కనిపించాయి. ఇంకేముంది ఏమిటిరా బాబు అంటూ తలపట్టుకున్నారు.
ఇదేం నెంబరు ప్లేటురా నేనెప్పుడూ చూడలేదు
ఈ నెంబరు ప్లేటు ఏంది బాబు ఇన్సూర్డ్ బై మాఫియా అని రాసి ఉంది ఏమిటి నాయనా. ఇదేం నెంబరు ప్లేటురా నేనెప్పుడూ చూడలేదని ముక్కున వేలేసుకున్నారు. కొత్తగా ఉందంటూ ట్రాఫిక్ పోలీస్ ఆశ్చర్యం వ్యక్తం చేశాడు. మాఫియా ఏందిరా ఏ మాఫియారా మీరు అంటూ ప్రశ్నించడంతో ద్విచక్రవాహనదారుడు నోటి నుంచి మాటే రాలేదు. అంతేకాదు, బైక్ సైలెన్సర్ ను కూడా మోడిఫై చేసి ఉండడం గుర్తించారు.
అప్పటికప్పుడు నెంబర్ ప్లేట్ మార్చేసిన పోలీసులు
కాసేపు ఇలానే ఉండగా చివరికి ఆ బైక్ ను ఇటీవలే వేరే వ్యక్తి నుంచి కొనుగోలు చేశానని, అయితే నెంబరు ప్లేటును మార్చకుండా అలాగే ఉంచానని సదరు ద్విచక్రవాహనదారుడు వెల్లడించాడు. దాంతో ట్రాఫిక్ పోలీసులు అప్పటికప్పుడు ఆ యువకుడిని ఇంటికి పంపించి నెంబరు ప్లేటు తెప్పించి అక్కడే రోడ్డుపైనే బండికి బిగించారు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.