ప్యాపిలి, (తెలుగు ప్రభ): సమాజంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదని ప్యాపిలి ఎస్సై నాగార్జున హెచ్చరించారు. జిల్లా ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు స్థానిక పోలీస్స్టేషన్లో రౌడీషీటర్లు, పాత నేరస్థులకు ప్రత్యేక కౌన్సెలింగ్ నిర్వహించారు. రౌడీషీటర్ల ప్రస్తుత జీవన విధానం, ఉపాధి వివరాలను పోలీసులు అడిగి తెలుసుకున్నారు. గతంలో చేసిన తప్పులను పునరావృతం చేయకుండా పద్ధతి మార్చుకుని సత్ ప్రవర్తన తో జీవించాలని ఎస్సై సూచించారు.
గంజాయి, అక్రమ మద్యం రవాణా, పేకాట, దౌర్జన్యాలు, భూ వివాదాలు వంటి చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడినా, ప్రజలను భయభ్రాంతులకు గురిచేసినా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. రౌడీషీటర్ల కదలికలపై నిరంతరం నిఘా ఉంటుందని, నిబంధనలు ఉల్లంఘిస్తే పీడీ యాక్ట్ వంటి కఠిన చట్టాల కింద కేసులు నమోదు చేసి జైలుకు పంపుతామని స్పష్టం చేశారు.
నేర ప్రవృత్తిని వీడి కుటుంబంతో కలిసి గౌరవప్రదమైన జీవితం గడపాలని, శాంతిభద్రతల పరిరక్షణకు పోలీసులకు సహకరించాలని ఎస్సై కోరారు. కార్యక్రమంలో పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

