ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు తన కుటుంబ సభ్యులతో కలిసి.. తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు. సామాన్య భక్తుడిలా వైకుంఠం క్యూ కాంప్లెక్స్ నుంచి చంద్రబాబు ఆలయ ప్రవేశం చేశారు. క్యూ కాంప్లెక్స్ దగ్గర టీటీడీ ఈవో శ్యామలరావు స్వాగతం పలికారు. ఆలయ మహా ద్వారం దగ్గరకు చేరుకున్న చంద్రబాబుకు ఆలయ అర్చకులు, ఈవో, అదనపు ఈవో స్వాగతం పలికారు. చంద్రబాబుతో పాటు ఆయన సతీమణి భువనేశ్వరి, కుమారుడు మంత్రి నారాలోకేష్, కోడలు బ్రాహ్మణి, మనవడు దేవాన్ష్ ఉన్నారు.
గర్భాలయంలో శ్రీవారి పట్టువస్త్రం సీఎంకు కప్పారు అర్చకులు. రంగనాయకుల మండపంలో సీఎం కుటుంబానికి వేదాశీర్వచనం అందజేశారు పండితులు. అనంతరం సీఎంకు ఈవో శ్యామలరావు, టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు తీర్థప్రసాదాలు అందజేశారు.
మనవడు దేవాన్ష్ పుట్టినరోజు సందర్భంగా.. శ్రీ వేంకటేశ్వర స్వామిని చంద్రబాబు నాయుడు స్వామివారిని దర్శించుకొని మొక్కలు చెల్లించుకున్నారు. దేవాన్ష్ పుట్టినరోజు సందర్భంగా మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద భవనానికి రూ.44 లక్షల విరాళం అందజేశారు. స్వయంగా భక్తులకు అన్నప్రసాదం పంపిణీ చేశారు. దేవాన్ష్ కూడా భక్తులకు అన్నదాన ప్రసాదం పంపిణీ చేశాడు. ఈ సంప్రదాయాన్ని ప్రతి సంవత్సరం దేవాన్ష్ పుట్టినరోజున కొనసాగిస్తున్నారు.