తిరుపతిలో తొక్కిసలాట ఘటన బాధాకరమి.. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. స్విమ్స్ ఆసుపత్రిలో బాధితులను పరామర్శించిన తర్వాత.. సీఎం చంద్రబాబు జిల్లా, టీటీడీ ఉన్నతాధికారులతో అధికారులతో సమీక్ష నిర్వహించారు. అనంతరం టీటీడీ పరిపాలన భవనంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. శ్రీవారి సన్నిధిలో ఎప్పుడూ ఎలాంటి అపచారాలూ జరగకూడదని ఆయన తెలిపారు.
తిరుపతి తొక్కిసలాట మృతుల కుటుంబాల్లో ఒకరికి.. కాంట్రాక్టు ఉద్యోగం ఇస్తామని CM చంద్రబాబు నాయుడు ఈ సందర్భంగా వెల్లడించారు. ఇక మృతుల కుటుంబాలకు రూ.25 లక్షల పరిహారం ఇస్తామన్నారు. గాయపడ్డ వారికి రూ. 5 లక్షలు, గాయపడ్డ 33 మందికి రూ.2 లక్షలు ఇవ్వనున్నట్లు చెప్పారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వారికి రేపు ప్రత్యేకంగా వైకుంఠ దర్శనం కల్పిస్తామని పేర్కొన్నారు.
వైకుంఠ ద్వార దర్శనం 10 రోజులెందుకు:
ఇక అన్ని కోణాల్లో సమాచారం మేరకు పటిష్టమైన నిర్ణయాలు చేపడుతాను. దివ్య క్షేత్రం పవిత్రతను కాపాడటానికి ప్రయత్నం చేస్తామని చంద్రబాబు అన్నారు. తాము చెప్పిన నిర్ణయాలు నిర్ణయాలు సరైనదని భావిస్తే బోర్డులో చర్చించి అమలు చేయాలని తెలిపారు. తిరుమల వైకుంఠ ద్వార దర్శనం 10 రోజుల పాటు జరపడాన్ని సీఎం చంద్రబాబు వ్యతిరేకించారు. వైకుంఠ ఏకాదశి, ద్వాదశి అనేవి పవిత్రమే కానీ దాన్ని 10 రోజులెందుకు చేశారో తనకు తెలియడం లేదన్నారు. పూర్వం నుంచి పాటించే సంప్రదాయాన్ని మార్చకుండా అనుసరించాలనేది తన అభిప్రాయమన్నారు. ఆ విషయంలో ఆగమ పండితులు తుది నిర్ణయం తీసుకోవాలని పేర్కొన్నారు.
చంద్రబాబు సంచలన నిర్ణయం:
ఇక తొక్కిసలాటకు బాధ్యులుగా చేస్తూ పలువురు అధికారులను సీఎం చంద్రబాబు నాయుడు సస్పెండ్ చేశారు. DSP రమణకుమార్, గోశాల డైరెక్టర్ హరినాథరెడ్డి బాధ్యత లేకుండా పనిచేశారని.. వీరిని వెంటనే సస్పెండ్ చేస్తున్నట్లు తెలిపారు. ఈ ఘటన జరగకుండా చూడాల్సిన బాధ్యత ఉన్నా వాళ్లు సరిగ్గా పనిచేయలేదని CM చెప్పారు. అలాగే ఎస్పీ సుబ్బరాయుడు, టీటీడీ జేఈఓ గౌతమి, CSO శ్రీధర్ ను వెంటనే ట్రాన్స్ ఫర్ చేస్తున్నట్లు వెల్లడించారు.
తొక్కిసలాటపై జుడీషియల్ ఎంక్వైరీ: మరోవైపు తిరుపతి తొక్కిసలాట ఘటనపై జుడీషియల్ ఎంక్వైరీ వేస్తున్నట్లు సీఎం చంద్రబాబు చెప్పారు. ఇలాంటివి ఎక్కడా జరగడానికి వీల్లేదని.. ఘటనపై చాలా బాధపడుతున్నామని పేర్కొన్నారు. ఇటు టీటీడీ ఛైర్మన్, అటు ఈవో, మేనేజ్మెంట్, అధికారులు ఇంకా సమన్వయంతో పనిచేయాలని సూచించారు. దేవుని పవిత్రత దెబ్బతినకుండా చూడాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు.