తిరుమల(Tirumala)లో ఆదివారం ఉదయం విఐపి విరామ సమయంలో ఆది వరాహ క్షేత్రంగా పిలవబడే శ్వేత వరాహ రూపంలో వెలసిన ఆ శ్రీమన్నారాయణుడ్ని కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకున్నారు హోమ్ శాఖ మంత్రి(Home Minister Anitha) అనిత. వీరికి టీటీడీ అధికారులు, అర్చకులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి.. తీర్థప్రసాదాలు అందజేయడం జరిగింది.

ఆలయం వెలుపల హోమ్ శాఖ మంత్రి అనిత మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర, దేశ ప్రజలకు శ్రీరామ నవమి శుభాకాంక్షలు తెలియజేశారు. పరిపాలన గురించి ఆలోచన చేయాలంటే శ్రీరామ చంద్ర మూర్తి పరిపాలన గురించి తెలియాలని అన్నారు. ఎన్డీయే కూటమి ప్రభుత్వం రామరాజ్యాన్ని స్థాపన చేసిందని తెలియజేశారు.

సీఎం చంద్రబాబు నాయుడు అభివృద్ధికి విజన్ 2047 దీక్ష చేపట్టారని తెలిపారు. పీ4 విధానంలో బంగారు కుటుంబాలను అభివృద్ధిలోకి తీసుకొచ్చే విధంగా చర్యలు తీసుకున్నట్లు చెప్పారు. సీఎం చంద్రబాబు నాయుడు తీసుకొస్తున్న అభివృద్ధికి ఎలాంటి అడ్డంకులు లేకుండా చల్లని స్వామి వారి దయ ఉండాలని కోరుకున్నట్లు వెల్లడించారు.