కుమారుడు ప్రమాదం నుంచి బయటపడిన నేపథ్యంలో.. ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సతీమణి అన్నా లెజినోవా (Anna Lezhinova) తిరుమల శ్రీవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించారు. సోమవారం తెల్లవారుజామున ఆమె సుప్రభాత సేవలో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. ఇక దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో అన్నా కొణిదెలకి వేద పండితులు వేదాశీర్వచనం అందించగా, ఆలయ అధికారులు శ్రీవారి తీర్థ ప్రసాదాలు అందజేశారు.
శ్రీలక్ష్మీ వేంకటేశ్వరస్వామివారి దర్శనానికి ముందుగా ఆదివారం సాయంత్రం తిరుమలకు చేరుకున్న అన్నా, ఆలయ సంప్రదాయాలను పాటిస్తూ భూవరాహస్వామి ఆలయంలో పూజలు చేశారు. అనంతరం కళ్యాణకట్ట వద్ద తలనీలాలు సమర్పించారు. హిందూ మతంపై విశ్వాసంతో శ్రీవారి దర్శనం పొందుతున్నానని డిక్లరేషన్ పై సంతకం చేశారు. టీటీడీ అధికారులు అన్నా లెజినోవాకు వైకుంఠ క్యూ కాంప్లెక్స్‌లో ఘన స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శన అనంతరం తీర్థప్రసాదాలు అందజేశారు. బస కోసం ఆమె గాయత్రీ నిలయంలో తలదాచుకున్నారు.
ఈ నెల ప్రారంభంలో పవన్ కళ్యాణ్ కుమారుడు మార్క్ శంకర్ పవనోవిచ్ సింగపూర్‌లో జరిగిన అగ్ని ప్రమాదంలో గాయపడ్డ విషయం తెలిసిందే. తండ్రి పవన్ కళ్యాణ్ వెంటనే అక్కడికి వెళ్లి కొద్ది రోజుల పాటు ఆసుపత్రిలో తండ్రిగా తాపత్రయంతో ఉన్నారు. చికిత్స అనంతరం మార్క్ పూర్తిగా కోలుకొని కుటుంబంతో కలిసి శనివారం రాత్రి హైదరాబాద్‌కి తిరిగొచ్చారు. శంషాబాద్ ఎయిర్‌పోర్టులో అన్నా లెజినోవా, కూతురు పొలెనా అంజనా పవనోవా, మార్క్ శంకర్‌తో కలిసి పవన్ కనిపించారు. తన కుమారుడి ఆరోగ్యంపై ప్రార్థనలు చేసిన వారందరికీ పవన్ ధన్యవాదాలు తెలిపారు. సింగపూర్ వైద్యసిబ్బంది అందించిన సహకారం మరచిపోలేనిదన్నారు. తన కుమారుడి ఆరోగ్యం నిలకడగా ఉండటం పట్ల కృతజ్ఞతగా, తిరుమల శ్రీవారికి మొక్కులు తీర్చేందుకు అన్నా లెజినోవా ప్రత్యేకంగా తిరుమలకి వెళ్లడం ఆమె భక్తిశ్రద్ధలకు నిదర్శనంగా నిలిచింది.