తిరుమల (Tirumala)లో చిరుత సంచారంతో మరోమారు తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) అధికారులు అప్రమత్తమయ్యారు. అలిపిరి నడక మార్గంలో ఆంక్షలు అమలు చేశారు. సాయంత్ర సమయంలో భక్తులను గుంపులు గుంపులుగా అనుమతిస్తున్నారు.
గుంపులో 70 నుంచి 100 మంది ఉండేలా టీటీడీ చర్యలు తీసుకుంటుంది. 12 సంవత్సరాల లోపు చిన్నపిల్లలను 2 గంటల అనంతరం నడక మార్గంలో అనుమతిలేదన్నారు. రాత్రి 9:30 గంటలకు నడకదారి మూసి వేస్తున్నట్లు తెలిపారు.
ఇప్పటికే చిరుతల సంచారంతో భక్తులను గుంపులు గుంపులుగానే నడక మార్గంలో సెక్యూరిటీ సిబ్బంది వెళ్లనిస్తున్నారు. అలిపిరి నడక మార్గంలో 2023 జూలై, ఆగస్టు నెలల్లో కౌశిక్, లక్షిత పై చిరుతల దాడి జరిగినప్పటి నుంచి దాదాపు 20 నెలలుగా నడక మార్గంలో టిటిడి అప్రమత్తంగా ఉంది.
నిన్న రాత్రి అలిపిరి నడక దారిలో 7 వ మైలు వద్ద చిరుత కనిపించడంపై భక్తుల్లో ఆందోళన మొదలైంది. భక్తుల కదలికలను గుర్తించిన చిరుత శబ్దానికి అడవిలోకి వెళ్లిపోగా విషయాన్ని భక్తులు టీటీడీ సెక్యూరిటీ దృష్టి తీసుకెళ్లారు. దీంతో ఘటన స్థలానికి చేరుకుని చిరుత జాడ తెలుసుకునే ప్రయత్నం చేసింది టీటీడీ విజిలెన్స్ సిబ్బంది.