కోడిగిత్తల రంకెలు.. హుషారెత్తే యువకులతో పల్లెలలో సంక్రాంతి సంబరాలు అంబరాన్ని అంటుతున్నాయి. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో జల్లికట్టు సాహస క్రీడ అనాదిగా కొనసాగుతోంది. తమిళనాడు తరహాలోనే ఈ ప్రాంతంలో కూడా జల్లికట్టు నిర్వహించడం ఆనవాయితీ.
ఏపీలో సంక్రాంతి వచ్చిందంటే కోస్తా ప్రాంతంలో కోడిపందాలు, రాయలసీమ జిల్లాలైన అనంతపురం, కర్నూలు కడప జిల్లాలో ఎద్దుల బండలాగుడు పోటీలు జరుగుతాయి. తిరుపతి, చిత్తూరు జిల్లాలలో జల్లికట్టు నిర్వహించడం ఆనవాయితీ. జనవరి మాసంలో సంక్రాంతికి ముందు సంక్రాంతి తర్వాత వరుసగా ఆయా గ్రామాల్లో జల్లికట్టు వేడుకగా నిర్వహిస్తుంటారు.
సీఎం సొంతూరు దగ్గర జల్లికట్టు ఆనవాయితీ
చంద్రగిరి. జీడీ నెల్లూరు నియోజకవర్గాల్లో ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ఈ జల్లికట్టు కేవలం చంద్రగిరి నియోజకవర్గం, జీడీ నెల్లూరు నియోజకవర్గాల్లో మాత్రమే నిర్వహించడం సాంప్రదాయంగా వస్తోంది. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్వగ్రామం నారావారిపల్లె సమీప గ్రామాల్లోనే నిర్వహించడం ఆనవాయితీ. చంద్రగిరి నియోజకవర్గం లోని చంద్రగిరి మండలం రామిరెడ్డిపల్లి, భీమవరం, రంగంపేట, గంగుడుపల్లి, శానంబట్ల, కొత్త శానంబట్ల గ్రామాలలో నిర్వహిస్తారు. రామచంద్రపురం మండలం అనుపల్లి, గోకులాపురం ఉప్పులి వంక, అంగీవారి కండ్రిగ, పాకాల మండలం పనభాకం, పాకాల వారి పల్లె, నూతి గుంట వారి పల్లె తదితర ప్రాంతాల్లో నిర్వహిస్తారు. అలాగే జీడి నెల్లూరు నియోజకవర్గంలోని వెదురుకుప్పం మండలంలోని పచ్చికాపల్లం, బ్రాహ్మణపల్లి, చవట గుంట తదితర ప్రాంతాల్లో నిర్వహిస్తారు.
పలక బహుమతుల కోసమే ఇదంతా
కోడిగిత్తల కొమ్ముల పలక బహుమతులను దక్కించుకునేందుకు యువకుల పోటీ హోరాహోరీగా సాగుతుంది. పశువుల పండుగలో భాగంగా తమ తమ పశువులను అందంగా అలంకరించి ముస్తాబు చేస్తారు. తమకు నచ్చిన సినిమా అభిమానులు రాజకీయ పార్టీ నాయకుల బొమ్మలను పలక మీద అలంకరించి నగదు, బంగారు, వెండి వంటి విలువైన బహుమతులను మూట కట్టి జల్లికట్టులో వదిలేస్తారు. విలువైన ఈ పలకల బహుమతులను దక్కించుకునేందుకు యువకులు పోటీ పడతారు. ఈ బహుమతులను గెలుచుకునేందుకు తమిళనాడు కర్ణాటక రాష్ట్రాల నుంచి కూడా వస్తుంటారు. సమీప గ్రామాల ప్రజలతో పాటు పక్క రాష్ట్రాల నుంచి కూడా పెద్ద ఎత్తున ప్రజలు పోటీలను తిలకించేందుకు తరలివస్తారు.
10 నుంచి 15 గ్రామాలు కలిసి
సమీపంలో 10 నుంచి 15 గ్రామాలకు చెందిన రైతులు తమ పశువులను ఒక గ్రామంలో చేర్చి ఈ జల్లికట్టు నిర్వహించడం అన్నవాయితీగా వస్తోంది. నిషేధం ఉన్నా కొనసాగుతున్న సాహస క్రీడైన జల్లికట్టు స్థానికులకు అత్యంత ప్రియమైన సంక్రాంతి సరదాగా ఉంది. జల్లికట్టు సాహస క్రీడ రాష్ట్రంలో నిషేధం ఉన్నప్పటికీ ఈ క్రీడా సాంప్రదాయ బద్ధంగా సంక్రాంతికి కొనసాగడం ఆనవాయితీగా వస్తుంది. చిత్తూరు, తిరుపతి జిల్లా పోలీసులు ప్రతి పర్యాయం జల్లికట్టుపై నిషేధం ఉందని, నిర్వహించరాదని ప్రకటనలు హెచ్చరికలు చేస్తూ ఉండడం యథావిథిగా రైతులు పశువుల పండుగ పేరుతో జల్లికట్టు నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది.
గ్రామీణ సంస్కృతిలో ఇదంతా భాగం
తరతరాలుగా తమ సంస్కృతి సాంప్రదాయంలో భాగంగానే జల్లికట్టు నిర్వహిస్తున్నామని రైతులు చెబుతున్నారు. అనేకమంది యువకులు ఈ సహస క్రీడలో ప్రాణాలు కోల్పోయినప్పటికీ జల్లికట్టు సాహస క్రీడగా రెట్టించిన ఉత్సాహంతో నిర్వహించేందుకు ఈ ప్రాంత రైతులు ముందుకువచ్చి తమ గ్రామ సంప్రదాయాలను కొనసాగిస్తున్నారు.