తిరుమల(Tirumala) శ్రీవారి ఆలయం మహాద్వారం వద్ద ఉద్యోగి దాడి ఘటనపై టిటిడి పరిపాలనా భవనంలో మూడు ఉద్యోగ సంఘాలు నాయకులు సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా టిటిడి ఉద్యోగుల సంఘం నేత వెంకటేష్ మాట్లాడారు.
టిటిడి మూడు ఉద్యోగ సంఘాలు సమావేశంలో కొన్ని నిర్ణయాలు తీసుకున్నామని చెప్పారు. మహా ద్వారం వెలుపలకు వచ్చే మార్గం క్లోజ్ చేశారు, దానికి బోర్డు కూడా పెట్టారని చెప్పారు. బాలాజీ పై దురుసుగా ప్రవర్తించిన పాలకమండలి సభ్యుడు నరేష్ పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నామన్నారు.
గురువారం ఉదయం 9.30 నుండి 10.30 వరకు టిటిడి పరిపాలనా భవనం ఎదుట ఉద్యోగులు నిరసన తెలియచేస్తారని చెప్పారు. గత మూడు నెలలుగా టిటిడి ఉద్యోగులపై వేధింపులు ఎక్కువ అయ్యాయని ఈ సందర్భంగా ఆయన తెలిపారు. గతంలో పాలకమండలి సభ్యురాలు పనబాక లక్ష్మి సూరి సూరి అనే ఉద్యోగిని బదిలీ చేశారన్నారు. పడి కావలి వద్ద ఉద్యోగిని ఇబ్బందులు పెట్టారన్నారు.
టిటిడి పాలక మండలి బోర్డు సభ్యత్వం రద్దు చేయలన్నారు. టిటిడి ఉద్యోగులకు బహిరంగ క్షమాపణలు చెప్పాలన్నారు. ఇటీవల ఉద్యోగులను అకారణంగా బదిలీ, వేటు వేసిన వారిని తిరిగి పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. మంత్రి నారా లోకేష్ ను కలుస్తాం, చర్యలు తీసుకోకుంటే భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామని హెచ్చరించారు.
టిటిడి వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు చీర్ల కిరణ్ మాట్లాడుతూ బాలాజీ కు క్షమాపణ చెప్పాలి, టిటిడి ఉద్యోగులు అందరికీ క్షమాపణ చెప్పాలన్నారు. బోర్డు సభ్యుడుకు మహా ద్వారం ప్రవేశం లేదన్నారు. కానీ అటు వైపు వచ్చిందే కాక ఉద్యోగిపై దురుసుగా ప్రవర్తించటం సరికాదన్నారు. టిటిడి పాలకమండలి సభ్యుడు నరేష్ కు కేటాయించిన కారు, గెస్ట్ హౌస్, వెనక్కి తీసుకోవాలన్నారు. రేపు ఉదయం టిటిడి ఉద్యోగులు పరిపాలన భవనం ఎదుట నిరసన చేపడతామని చెప్పారు. త్వరలో భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామన్నారు.