తిరుమల టీటీడీ గోశాలలో గోవుల మృతిపై జరుగుతున్న ప్రచారం రాజకీయ రంగు రాజుకుంటోంది. ఈ అంశంపై అధికార కూటమి నేతలు, టీటీడీ ప్రతినిధులు, బీజేపీ నేతలు ఒకేసారి స్పందిస్తూ వైఎస్సార్ కాంగ్రెస్ నేతలపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు.
టీటీడీ గోశాలలో వందకు పైగా గోవులు మృతి చెందాయని వస్తున్న వార్తలు.. మంత్రి నారా లోకేష్ ఖండించారు. దురుద్దేశంతో టీటీడీని లక్ష్యంగా చేసుకుని సోషల్ మీడియాలో తప్పుడు కథనాలు వైరల్ చేస్తున్నారు అని విమర్శించారు. భక్తుల మనోభావాలు రెచ్చగొట్టేందుకు వైఎస్సార్‌సీపీ కుట్రపూరితంగా వ్యవహరిస్తోందని.. టీటీడీ స్పష్టమైన నివేదిక ఇచ్చిన తరువాత కూడా అసత్యాలను ప్రచారం చేయడం బాధాకరమని పేర్కొన్నారు.. పవిత్ర హిందూ ధర్మ సంస్థలను రాజకీయ లబ్ధికోసం ఉపయోగించకండి అంటూ ట్వీట్ చేశారు.
అలాగే టీటీడీ అధికారిక ప్రకటనలో, సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న గోవుల మృతి ఫొటోలు టీటీడీ గోశాలకు సంబంధించినవేమీ కాదని.. అవి ఇతర ప్రాంతాలదని స్పష్టం చేసింది. కేవలం తప్పుడు ప్రచారంతో భక్తుల్లో గందరగోళం రేపేందుకు కొందరు ఉద్దేశపూర్వకంగా ప్రయత్నిస్తున్నారు. గోవుల సంరక్షణలో టీటీడీ ఎలాంటి నిర్లక్ష్యం చూపలేదు అని తెలిపింది. ఇక ఈ దుష్ప్రచారంపై బీజేపీ నేత, టీటీడీ బోర్డు సభ్యుడు భానుప్రకాష్ రెడ్డి కూడా ఘాటుగా స్పందించారు.
తిరుపతిలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ, భూమన కరుణాకర్ రెడ్డి లాంటి వారు స్వయంగా టీటీడీ ఛైర్మన్‌గా పనిచేసిన వ్యక్తి. ఆయన నుంచి ఇటువంటి అవాస్తవ ప్రచారం చేయడం ఘోరమన్నారు. రాజకీయ ప్రయోజనాల కోసం గోశాలపై అసత్యాలు చెబుతున్న తీరు శోచనీయం అని విమర్శించారు. సమగ్రంగా చూస్తే.. టీటీడీ గోశాలపై వస్తున్న ఆరోపణలు వాస్తవానికి దూరంగా ఉన్నాయని స్పష్టమవుతోంది. అధికార ప్రతినిధులు ప్రజలను అపోహలు కలిగించే ప్రచారాన్ని నమ్మవద్దని విజ్ఞప్తి చేస్తున్నారు.